ప్రతి భారతీయుడు గర్వించదగిన అంశం. 140 కోట్ల మంది భారతీయుల దశాబ్దాల కల నెరవేరింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన భారత్ అంతరిక్ష చరిత్రలో సరికొత్త రికార్డును సృష్టించింది. 15 ఏళ్ల క్రితం చందమామపై నీరుందని తెలిపిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇప్పుడు చంద్రుడిపై ఇప్పటివరకూ ఎవరూ వెళ్లని, ఎవరూ చూడని దక్షిణ ధ్రువాన్ని ప్రపంచానికి చూపింది.
దిగ్విజయంగా చందమామపై కాలుమోపిన భారత్ ప్రపంచ దేశాలకు తన సత్తా మరోసారి చాటింది. నాలుగేళ్ల క్రితం చెదిరిపోయిన కలను నేడు సాకారం చేసుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట నుంచి జులై 14న చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది. 41 రోజుల తర్వాత ఆగస్ట్ 23న సా.6.04 నిమిషాలకు నిర్దేశించిన సమయంలో సాఫ్ట్ ల్యాండ్ అయింది.
చంద్రుడి దక్షిణ ద్రువంపైకి వెళ్లడం అంతరిక్షంలో ప్రబల శక్తులుగా పేరున్న అమెరికా, రష్యా, చైనాకు సైతం అందని ద్రాక్ష అయింది. అటువంటి కఠినమైన ప్రాంతంలో వ్యోమనౌకను సురక్షితంగా దించి భారత్ సరికొత్త చరిత్రను తిరగరాసింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా రికార్డ్ సృష్టించింది.