ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో మరో భారీ ప్రాజెక్టు రాష్ట్రంలో ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. రూ.727 కోట్లతో ఏపీలో సోలార్ బ్యాటరీ తయారీ ప్రాజెక్టు నెలకొల్పేందుకు ట్రైటన్ సోలార్.. ఈడీబీతో ఈమేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు సౌర బ్యాటరీల ప్రాజెక్టువైపు దృష్టి సారించింది. సౌర విద్యుత్ పరికరాల తయారీలో పేరున్న ట్రైటన్ సోలార్ ఆంధ్రప్రదేశ్‌లో సోలార్ బ్యాటరీ తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది.
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు, అధికారుల బృందంతో ట్రైటన్ సోలార్ సంస్థ చర్చలు జరిపింది. ప్రాజెక్టు ఏర్పాటుకు ఆ సంస్థ ఛైర్మన్ హిమాంశు పటేల్, మేనేజింగ్ పార్టనర్ నంద శాండిల్య- పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈవో జాస్తి కృష్ణకిశోర్‌ల మధ్య సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్లాంట్ ఏర్పాటుకు 100 నుంచి 200 ఎకరాల భూమి అవసరమవుతుందని ఆసంస్థ ప్రతిపాదించింది. సౌర బ్యాటరీని తయారు చేయడానికి నానో టెక్నాలజీ, లిథియం పాలిమర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని, దీనిలో భాగంగా సౌర బ్యాటరీలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయని ముఖ్యమంత్రి అన్నారు. దీని వల్ల వాయుకాలుష్యం తగ్గడమే కాకుండా, ప్రజలకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామమని, నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.