ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోడీకి తిత్లీ పెను తుఫాన్ కలిగించిన బీభత్సంపై లేఖ రాశారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.2,800 కోట్ల మేర నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. తక్షణ సాయం కింద రూ. 1200 కోట్లు విడుదల చేయాలని కోరారు.
తిత్లీ తుఫాన్ కారణంగా విద్యుత్ రంగానికి రూ.500 కోట్లు, రహదారులు, భవనాల శాఖకు రూ. 100 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు మరో రూ.100 కోట్లు నష్టం వాటిల్లిందని వివరించారు. వ్యవసాయ, ఉద్యాన తోటలకు సంబంధించి రూ.1800 కోట్ల నష్టం వాటిల్లగా పశుసంవర్ధక, మత్స్యశాఖకు రూ.100కోట్ల మేర నష్టం కలిగిందని లేఖలో పేర్కొన్నారు. గ్రామీణ నీటిసరఫరా శాఖకు రూ.100 కోట్లు, జలవనరుల శాఖకు రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయకచర్యలను వేగవంతం చేసిందని.. కేంద్రం కూడా ముందుకు వచ్చి ఉదారంగా సాయం అందించాలని కోరారు.