టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాడుతోన్న భాషపై తీవ్రంగా స్పందించారు.. సీఎం జగన్‌కు వార్నింగ్ ఇస్తున్నా..! జగన్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి.. భాషను కంట్రోల్ చేసుకోవాలి.. నోరు పారేసుకుంటే హుందాతనం రాదు.. నేను కూడా ఒక్క నిమిషంలో ఆయన అనే మాట అనగలను. నేను ఆ మాటంటే జగన్ తల ఎక్కడ పెట్టుకుంటాడు? అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. అసెంబ్లీలో మంత్రుల ప్రవర్తన దారుణంగా ఉందని మండిపడ్డ ప్రతిపక్ష నేత.. ఇరిగేషన్‌పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి తెలియని వాళ్లతో రిపోర్టులు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. తనను వైఎస్ ఎంత ఎగతాళి చేసినా నేను మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఆపలేదన్న ఆయన.. రూ.50 వేల కోట్ల పనులు జరిగితే రూ.55 వేల కోట్ల అవినీతి అంటున్నారంటూ ఎద్దేవా చేశారు.
ఇక, గతంలో సభలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చెన్నారెడ్డి లాంటి వారు ఇలాగే మాట్లాడితే వారికి వార్నింగ్ ఇచ్చానని గుర్తుచేసుకున్న చంద్రబాబు.. ఇప్పుడు వైఎస్ జగన్‌ను కూడా హెచ్చరిస్తున్నా.. చిల్లరతనంతో చీప్‌గా మాట్లాడొద్దు… ముఖ్యమంత్రి కుర్చీకి విలువ ఇవ్వాలి.. అని సూచించారు. మరోవైపు, ప్రతీరోజూ అసెంబ్లీలో పులివెందుల పంచాయతీ నడుస్తోందని విమర్శించారు చంద్రబాబు. జగన్ శాసిస్తుంటే, స్పీకర్ పాటిస్తున్నారని ఆరోపించిన ఆయన.. కనీసం తాము వాకౌట్ చేస్తామన్నా.. తమకు అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, తనకు జరిగిన లబ్ధికి జగన్… తెలంగాణ రుణం తీర్చుకుంటున్నారని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. అలాంటిది ఇప్పుడు మళ్లీ తెలంగాణలో నీటి ప్రాజెక్టులు ఏంటి? అని ప్రశ్నించారు. రాయలసీమకు నీర ఇవ్వాలంటే కోస్తా నుంచి తెలంగాణకు నీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు.. అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్ పర్మినెంట్ కాదని, రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో సమస్యలు రాకుండా ముందుకుసాగాలన్నారు.