దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని అనుచరులు గద్దె కిషోర్ మరికొందరు గార్లమడుగు మాజీ సర్పంచి సాంబశివకృష్ణారావుపై దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లు చెప్పినా చింతమనేని తీరు మారడం లేదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఒక్కరు చేసే తప్పునకు పార్టీ మొత్తం సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందంటూ చంద్రబాబు వద్ద పలువురు సీనియర్ నేతలు ప్రస్తావించారు. చింతమనేని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు చింతమనేనిపై మండిపడ్డారు. పని చేస్తే సరిపోదని.. పద్ధతిగా ఉంటేనే పార్టీలో భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సహనానికి పరీక్ష పెడితే ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.