ముఖ్యమంత్రి చంద్రబాబు నూటికి వెయ్యి శాతం మనమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని పార్టీ నేతలతో అన్నారు. ఇందులో రెండో ఆలోచనే లేదని చెప్పారు. మెజార్టీ ఎంతనేదే తేలాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ నేతలతో గురువారం సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అభ్యర్ధులు, బూత్ కన్వీనర్లు, సేవామిత్రలు ఇందులో పాల్గొన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో అన్ని నివేదికలూ పరిశీలించి చెబుతున్నానని, మళ్లీ ప్రభుత్వం మనదేనని పునరుద్ఘాటించారు. టీడీపీలో గెలుస్తారనుకున్న వారితో వైసీపీ నేతలు కొందరు టచ్‌లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి కుట్రలను ఆధారాలతో సహ బయట పెట్టాలన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కౌంటింగ్‌కు ముందు, కౌంటింగ్ రోజు వ్యవహరించాల్సిన తీరుపై పలు సూచనలు చేశారు.
‘ఎన్నికల్లో కీలక ఘట్టం కౌంటింగ్ ప్రక్రియకు చేరాం. కౌంటింగ్‌కు ముందస్తు ప్రిపరేషన్ అతి ముఖ్యాంశం. ప్రతి నియోజకవర్గానికి కౌంటింగ్‌కు ప్రత్యేక బృందాలు ఏర్పడాలి. అనుభవం ఉన్నవాళ్లనే ఎంపిక చేయాలి. ఒక అడ్వకేట్, ఒక ఐటీ నిపుణుడు బృందంలో ఉండేలా చూసుకోవాలి. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్‌పై వర్క్‌షాప్ పెట్టాలి. కౌంటింగ్ విషయంలో అంతా అప్రమత్తంగా ఉండాలి. గత నాలుగు ఎన్నికల ఓటింగ్ సరళిని విశ్లేషించాలి. ఏ బూత్‌లో ఏ పార్టీకి ఎన్నిఓట్లు వస్తాయో చెప్పగలగాలి. ఫలితాలు వచ్చాక వాటిని బేరీజు వేయాలి. ఓడిపోతామన్న సీట్లలో కూడా మంచి ఆధిక్యత చూపాం. ఇది ఎలా సాధ్యం అయ్యిందనేది విశ్లేషించుకోవాలి. భవిష్యత్తు రాజకీయానికి వీటిని కేస్ స్టడీగా అధ్యయనం చేయాలి. కౌంటింగ్ ఏజెంట్లు మధ్యలోనే లేచి వచ్చేయ కూడదు. చివరిదాకా ఓపిగ్గా ఉండేవారినే ఏజెంట్లుగా పెట్టాలి. ప్రతి ఎన్నికలోనూ మనమే గెలవాలన్న స్ఫూర్తి అందరిలో రావాలి. ఏ స్థాయిలో ఎవరు బాగా పనిచేశారనే నివేదికలు పంపాలి. ప్రతి నియోజకవర్గంలో సమర్థ నాయకత్వం రూపొందాలి. అప్పుడే రాష్ట్ర స్థాయి నాయకత్వానికి అదనపు బలం. అన్నిస్థాయిల్లో పార్టీ నాయకత్వం పటిష్ఠంగా ఉండాలి’ అని పార్టీ నేతలతో చంద్రబాబు అన్నారు.