ఏపీ అభివృద్ధి చూసి పక్క రాష్ట్ర సీఎం ఓర్వలేకపోతున్నారని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అందుకే జగన్‌తో కలిసి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ‘అమరావతికి శంకుస్థాపన సమయంలో రూ.500 కోట్లు ఇద్దామని తెలంగాణ ప్రభుత్వం అనుకుందట. ప్రధాని రాజధానికి ఏమీ ఇవ్వకపోవడంతో ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. మీ భిక్ష మాకేమీ వద్దు. కావాలంటే నేనే తిరిగి రూ.500 కోట్లిస్తా’ అని చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. అంతకుముందు నరసమ్మ అనే వృద్ధురాలితో ముచ్చటించారు. ఆమెను చూసిన తర్వాత ఐదేళ్ల కష్టాన్ని ఐదు నిమిషాల్లో మరిచిపోయానని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిలో ఆనందాన్ని చూసేందుకే రూ.200 ఉన్న పింఛనును రూ.2వేలు చేశానని చెప్పుకొచ్చారు. వృద్ధాప్య పింఛనును రూ.3వేలకు పెంచుతానని మరోసారి హామీ ఇచ్చారు.
‘రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత నాది. వలసలు పోకుండా చేసే బాధ్యత నాది. బుక్కపట్నం చెరువుకు నీళ్లు తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. పట్టిసీమను అడ్డుకోవాలని కొందరు కుట్రలు పన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా పట్టిసీమ పూర్తిచేశాం. నదుల అనుసంధానం చేసి అనంతపురం చరిత్ర పూర్తిగా మారుస్తా. డ్వాక్రా సంఘాల మహిళలకు పసుపు-కుంకుమ కింద భవిష్యత్‌లో అనునిత్యం సాయం చేస్తా. పెళ్లి కానుక ద్వారా రూ.లక్ష ఇచ్చి ఆదుకుంటాం’ అని హామీ ఇచ్చారు.
‘లక్ష కోట్లు కొట్టేసి మనకు రావాల్సిన వాటిని ఇవ్వకుండా అమరావతికి రూ.500 కోట్లు ఇస్తానని కేసీఆర్ అన్నారు. మీ భిక్ష మాకేమీ వద్దు. నేనే రూ.500 కోట్లిస్తా. భవిష్యత్‌లో హైదరాబాద్‌ను అమరావతి మించిపోతుందని భావించి ఇప్పుడు జగన్‌తో కలిసి కుట్ర పన్నుతున్నారు. మోడీ, కేసీఆర్ ఇచ్చిన సొమ్మును జగన్ నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున పంచారు. అవినీతి సొమ్ముతో అధికారంలోకి రావాలని చూస్తున్నారు’ అని చంద్రబాబు విమర్శించారు.
‘వివేకాను హత్య చేసి దాచిపెట్టాలని చూశారు. గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేశారు. ఎవరికైనా గుండె పోటు వస్తే తల పగులుతుందా? రక్తం వస్తుందా? సాయంత్రానికి ఓ లేఖ బయటపెట్టారు. ఈ విషయంలో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారు. చిన్నాన్న హత్య కేసు బయటపడితే వీరి బండారం బయటపడుతుందని భయపడుతున్నారు. అందుకే వివేకా భార్య, కూతురితో నాటకాలు ఆడిస్తున్నారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం’ అని చంద్రబాబు హెచ్చరించారు. సంపద సృష్టించి రాష్ట్ర బంగారు భవిష్యత్‌కు పాటుపడతానని పునరుద్ఘాటించారు. ప్రపంచంలోనే ఐదు ముఖ్యమైన నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతానని చెప్పారు.