Chandrababu Naidu: కోనసీమ జిల్లా.. కొత్తపేట నియోజకవర్గంలో జరిగిన ప్రజాగళం సభలో టీడీసీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సీఎం జగన్ నన్ను పశుపతి అని సంభోదించారు. ఆ మాట విని నవ్వుకున్నాను. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడే పరమశివుడు. గరళాన్ని గొంతులో పెట్టుకుని మానవాళిని కాపాడాడు. అందుకే నేను శివావతారం ఎత్తాను అని చంద్రబాబు అన్నారు.
జగన్ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఎన్ని అవమానాలైనా భరిస్తానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో జగన్ ఒక్కడే బాగుంటే చాలు.. ఇంకెవ్వరూ బాగుపడకూడదనేది ఆయన ఉద్దేశమని చంద్రబాబు ఆక్షేపించారు. 2014లో తండ్రి మరణాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసిన జగన్ ఆ తర్వాత 2019లో బాబాయి హత్యను రాజకీయం చేశాడని.. ఇప్పుడేమో వృద్ధుల పేరుతో రాజకీయాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు.
ఫేక్ ప్రచారాలతో రాష్ట్రాన్ని జగన్ సర్వ నాశనం చేస్తున్నాడని.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వకుండా వేధిస్తున్నాడని చంద్రబాబు విమర్శించారు. బాబాయిని హత్య చేసిన హంతకులెవరో చెప్పి జగన్ ఓట్లు అడగాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గొడ్డలి గుర్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీచేయాలని ఎద్దేవా చేశారు. జగన్ చర్యలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందన్నారు. ఐదేళ్లలో ఎన్నో దాడులు, ఎన్నెన్నో దోపిడీలు చేశారని ధ్వజమెత్తారు.
తనతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కూడా జగన్ ఎన్నో ఆరోపణలు చేసి ఇబ్బందులకు గురిచేశాడని.. అయినా మేము భయపడలేదని, అరెస్టులకు కూడా సిద్ధపడ్డామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేని అసమర్థ సీఎం ఈ జగన్ అంటూ చంద్రబాబు మండిపడ్డారు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీ నిర్వహణపైనే చేస్తామని చంద్రబాబు అన్నారు. యువతకు ఏడాదికి 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అని చంద్రబాబు అన్నారు. నిరుద్యోగులకు రూ.3 వేలు భృతి ఇస్తామన్నారు.
రైతులను ఆదుకుంటాం, విద్యుత్ చార్జీలు పెంచబోమని. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా వారికి ఒక్కొక్కరికి రూ.15 వేలు వంతున ఇస్తాం. మహిళలకు ఏడాది మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఈ 40 రోజులూ మీరు కష్టించాలి. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలో టీడీపీ కూటమి అభ్యర్ధులను గెలిపించాలి. జగన్ జైలుకు పోతాడో.. ఆస్పత్రికి వెళ్తాడో ఇంకా తెలియదు. సైకో పోవాలని అందరూ అంటున్నారు.
జగన్ విధానాలతో మేత, విద్యుత్ రేట్లు పెరిగాయి. మేమొచ్చాక ఈ రంగానికి యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తాం. నా బీసీలంటూ 30 పథకాలను నిలిపివేశారు. కోనసీమ జిల్లాలో అంబేద్కర్‌కే అవమానం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై ఎన్నో దాడులు జరిగాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఏమయ్యాయి? మాదిగలకు న్యాయం చేసేలా ఆ సామాజికవర్గానికి ఎమ్మెల్సీ ఇస్తాం. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి పొలిట్‌బ్యూరో పదవి ఇచ్చాం అని చంద్రబాబు అన్నారు.
కాపులకు జగన్‌రెడ్డి ప్రభుత్వంలో తీరని అన్యాయం జరిగిందని చంద్రబాబు అన్నారు. కాపుల కోసం ఐదేళ్లలో జగన్ రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తానన్నాడు. చేశాడా? కనీసం పది కోట్లయినా ఇచ్చాడా? అని చంద్రబాబు దుయ్యబట్టారు. నేను అధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి రూ.1,000 కోట్లు కేటాయించాను. కాపుల్లో పేద వర్గాలకు న్యాయం చేసింది టీడీపీ హయాంలో మాత్రమేనని చంద్రబాబు అన్నారు.
గంజాయి, డ్రగ్స్‌కు రాష్ట్రాన్ని బలిచేస్తారా? మన పిల్లల జీవితాలతో ఆటలు ఆడుకునే పరమదుర్మార్గులు వీరు. గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడితే పిల్లలు ఎవరి చెప్పు చేతల్లోనూ ఉండరన్నదే నా బాధ. రావులపాలెంలో ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతోంది. ఈ వ్యాపారంలో కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పాత్ర ఉంది. మేమొచ్చాక ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తా. ప్రజాగళం సభల కు ఎక్కడ చూసినా మహా స్పందన. గెలుపు మనదే.. ఆకలి మీద సింహం వేట కోసం ఎలా వేచి చూస్తుందో నేడు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు టీడీపీ-జనసేన-బీజేపీ ఒక జట్టుగా మీ ముందుకొచ్చాం. రాష్ట్రాన్ని దొంగలపరం చేస్తారో.. కాపాడుకుంటారో మీ ఇష్టం అన్నారు.