జగన్ చిన్నవాడైనా చేతులు జోడించి నమస్కరిస్తున్నానని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారపక్ష సభ్యులు తమపై చేస్తున్న విమర్శలను వినలేని పరిస్థితి అని, అయినా, ప్రజల కోసం ఇవన్నీ భరిస్తున్నామని బాబు అన్నారు. ‘ఒక రాష్ట్రం ఒకే రాజధాని’ అన్నది తమ సిద్ధాంతం అని స్పష్టం చేశారు. తనపై వ్యక్తిగత దూషణలు చేసేందుకు అధికారపక్ష సభ్యులు పోటీపడ్డారని మూడు రాజధానులపై ప్రభుత్వ విధానం చెబితే బాగుండేదని అన్నారు. శివరామకృష్ణన్ నివేదికలో మూడు రాజధానులు ఏర్పాటు చేయమని గానీ, విజయవాడ, గుంటూరులు రాజధాని ఏర్పాటుకు తగిన ప్రదేశాలు కావు అని కానీ, ఫలానా చోటే రాజధాని ఏర్పాటు చేయాలని గానీ ఎక్కడా చెప్పలేదని గుర్తుచేశారు. అమరావతిలో రాజధాని వల్ల ఆహారభద్రతకు ముప్పు వస్తుందన్న అధికారపక్ష వాదన సరి కాదని అన్నారు.