తిరుపతి నుంచే తన రాజకీయ జీవితం ప్రారంభమైందని, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చానని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని, కష్టపడి పని చేస్తూ.. నిజాయతీగా ఉన్నానన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటు చేసిన రక్త నిధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. న్యాయం అనుకున్నప్పుడు రాజీలేని పోరాటం చేశానని, జాతీయ స్థాయిలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోరాడానని చెప్పారు. రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. విభజన అనివార్యమైతే రెండు ప్రాంతాలకూ న్యాయం చేయాలని కోరానని గుర్తు చేశారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై తిరుపతిలో ప్రధాని మోడీ హామీ ఇచ్చారని.. వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఆ హామీలు నెరవేర్చాలన్న డిమాండ్‌తో రాజీలేని పోరాటం చేశామన్నారు. ధర్మపోరాట దీక్ష ప్రారంభించి నేటితో ఏడాది పూర్తయిందని చంద్రబాబు వివరించారు.
‘ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది. ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేయాలని చూశారు. కానీ, నా పోరాటం ఎన్నికల సంఘంపై కాదు.. ఈసీ అవలంభించే విధానాలపైనే’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒడిశా, కర్ణాటక సీఎంలు ప్రయాణించే హెలికాప్టర్లను ఈసీ అధికారులు తనిఖీ చేశారని.. ప్రధాని హెలికాప్టర్‌లో తనిఖీ చేసిన అధికారిని మాత్రం సస్పెండ్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఐబీ సహా ఇతర అధికారులతో ప్రధాని సమీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని సీఎం అన్నారు. ‘అందరికీ ఆంక్షలు పెడితే నేను కూడా అనుసరిస్తాను. ఆంక్షలు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే ఎందుకు వర్తింపజేస్తున్నారు?’ అంటూ ఈసీపై మండిపడ్డారు. కర్ణాటక, తమిళనాడులో బీజేపీ మినహా ఇతర పార్టీల నేతలపైనే ఐటీ దాడులు జరిగాయని, ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయవద్దన్నారు. మోడీ కోసం కాకుండా దేశం కోసం పని చేయాలని ఈసీకి సూచించారు. ‘ఈ సారి మోడీ ఇంటికి వెళ్లడం ఖాయం’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.