టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు .. రాష్ట్రంలో గత ఐదేళ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, ఎక్కడా లేనన్ని ఉద్యోగాలు సృష్టించామని అన్నారు. రాష్ట్రానికి రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఒప్పందం కుదుర్చుకున్న పరిశ్రమలన్నీ రాష్ట్రానికి వస్తే.. మరో 30 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గురించి అమరావతిలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సంకల్పం గొప్పదైతే సకల దేవతలు మనవెంట ఉంటారని చంద్రబాబు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ.. పింఛన్‌ను రూ. 2 వేలకు పెంచామని గుర్తు చేశారు. కేంద్రం సహకరించకున్నా కసితో ముందుకు వెళ్లామన్నారు. రోజుకు 18 గంటలు కష్టపడి ఎన్నో సాధించుకున్నామన్నారు.
రుణమాఫీ సాధ్యం కాదని మొదట్లో అందరూ అన్నారని, వారి అపోహలను పటాపంచలు చేస్తూ.. రైతులకు రూ.24,500 కోట్లు రుణమాఫీ చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం సంపద సృష్టించాలన్నారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు సాగునీరు తెచ్చామన్న చంద్రబాబు… రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా తయారుచేస్తున్నామన్నారు. కాపు రిజర్వేషన్లు ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. రాళ్లసీమ అనంతపురానికి కియా మోటార్స్ తెచ్చామని గుర్తు చేశారు. ‘ డ్వాక్రా మహిళలకు రూ. 20 వేలు సాయం చేశాం. అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు ఆహార భద్రత కల్పించాం. నదుల అనుసంధానంతో మహా సంగమానికి శ్రీకారం చుట్టాం. ప్రపంచంలోనే గొప్ప నగరంగా అమరావతి మారుతోంది. ఐదేళ్లలో అందరూ అమరావతికి వచ్చేలా చేశాం’ అని సీఎం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగాలంటే టీడీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు.