Homeపొలిటికల్Chandrababu Naidu: కుప్పంలో లక్ష మెజార్టీ టీడీపీ లక్ష్యం

Chandrababu Naidu: కుప్పంలో లక్ష మెజార్టీ టీడీపీ లక్ష్యం

Chandrababu Naidu's speech at kuppam meeting
Chandrababu Naidu’s speech at kuppam meeting: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఈరోజు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, సైకిల్ స్పీడ్ పెంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగు తమ్ముళ్లు ఎవరికీ భయపడబోరని, అడ్డొస్తే పచ్చడి పచ్చడిగా తొక్కుకుంటూ వెళతామే తప్ప, ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

”ఇప్పటిదాకా మీరు నాపై ఏడుసార్లు అభిమానం చూపించారు. కుప్పంలో వైసీపీ అభ్యర్థికి ఈసారి డిపాజిట్లు కూడా రాకూడదు. నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం అడ్డుపడింది. కుప్పానికి హంద్రీనీవా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వానిది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చాక పోలీసులతో వారిని నియంత్రిస్తాం.

ఎన్నికలు సజావుగా జరగనివ్వాలని రౌడీలను హెచ్చరిస్తున్నా. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా.. జైలు నుంచి బయటికి రాగానే పార్టీ జెండా మోయడం ఆపలేదు. వైసీపీ నాయకులు యథేచ్చగా గ్రానైట్‌ వ్యాపారం చేస్తున్నారు. ‘కేజీయఫ్‌’ తరహాలో శాంతిపురంలో గ్రానైట్‌ తవ్వేశారు. ఈసారి కుప్పంలో టీడీపీకి లక్ష మెజార్టీ లక్ష్యం. పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నా” అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఏపీలో అరాచకపాలన పోవాలన్న ఉద్దేశంతోనే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని అన్నారు. మూడు పార్టీల అజెండా ఒక్కటేనని… రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ అజెండా అని చంద్రబాబు ఉద్ఘాటించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సాయం అవసరమని అన్నారు.

ఈసారి ఏపీలో 160 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్ సభ స్థానాలు గెలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.4 వేల పెన్షన్ ఇస్తామని, ఇంటివద్దకే తెచ్చి అందిస్తామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ముస్లింలకు అండగా నిలిచే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను కాపాడింది టీడీపీయేనని అన్నారు. ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులు రక్షించామని తెలిపారు.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu