తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్దు గోదావరి నదిలో మునిగిపోయిన లాంచీని 38 రోజుల తర్వాత బయటకు తీసిన ధర్మాడి సత్యం బృందానికి ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు లేఖ రాశారు. లేఖలో బయటకు తీసిన వారిని అభినందించారు. బాధితుల గోడును పట్టించుకోకుండా సీఎం, మంత్రులు నిర్లక్ష్యం చేసినా.. వారి కన్నీళ్లు తుడిచేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నం అభినందనీయమన్నారు. చంద్రబాబునాయుడు లేఖ యధాతథంగా…
బోటు ప్రమాదంలో బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్న మీ తపన, మునిగిన పడవను బయటకు తియ్యాలన్న మీ పట్టుదల ప్రశంసనీయం. గోదావరిలో మునిగిన రాయిల్ వశిష్ట పడవను వెలికితీసేందుకు మీరు చూపిన తెగువ, చొరవ, పడిన శ్రమను అభినందిస్తున్నాను. పడవ వెలికితీత కోసం మీరు చూపిన శ్రద్ధలో ఒక్క శాతం అయినా ప్రభుత్వం పెట్టి ఉంటే, ఈ దురవస్ధ బాధిత కుటుంబాలకు వాటిల్లేది కాదు. ఇన్ని ప్రాణాలు గోదాట్లో కలిసిపోయేవేకాదు.
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగానే కచ్చలూరు పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు కూడా దొరకని దుస్థితి ఏర్పడింది. పడవ వెలికితీతపై వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ పెట్టపోయినప్పటికీ మీరు అధికారుల వెంటపడి మరీ పడవను బయటకు తీస్తానని ముందుకొచ్చిన విషయం పత్రికల్లో చూశాను. మీ పట్టుదల సాయం చేయాలన్న తపన అభినందనీయం. బాధ్యతాయుతమైన మీ బృంద స్పూర్తి అందరిలో నెలకొనాలని ఆకాంక్షిస్తున్నాను. తమ వారిని కడసారి కూడా చూడలేమోనని కన్నీళ్లతో క్రుంగిపోయిన ఆప్తులకు మృతదేహాలను వెలికితీసి ఊరట కల్గించారు. తమ వారికి అంత్యక్రియలు నిర్వహించి వారి ఆత్మకు శాంతి కల్గించేందుకు మీరు, మీ బృందం దోహద పడ్డారు.
ఎంతో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు కచ్చలూరు పడవ ప్రమాదాన్ని, బాధితుల కన్నీళ్లను నిర్లక్ష్యం చేశారు. విపత్తులలో బాధితులను వదిలేసి దేశ విదేశాలకు విహారయాత్రలకు వెళ్లారు. కానీ మీరు కుటుంబాలను వదిలి, అన్న పానీయాలు మాని జడివానలో బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడిచేందుకు, వారి ఆప్తుల భౌతిక కాయాలను వారికి అప్పగించడం కోసం పడిన తపనను తెలుగుదేశం పార్టీ మనస్పూర్తిగా అభినందిస్తోంది.