నందమూరి తారకరత్నగుండెపోటుకు గురై.. నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు బెంగళూరు చేరుకున్నారు. నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులను అడిగి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారని వెల్లడించారు. వైద్యులతో తాను మాట్లాడానని, తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
నిన్నప్రారంభమైన లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రకు తారకరత్న వచ్చారని, పాదయాత్ర సమయంలో తారకరత్నకు గుండెపోటు వచ్చిందని వెల్లడించారు. కుప్పం ఆసుపత్రిలో తారకరత్నకు ప్రాథమిక వైద్యం అందించారని, ఎందుకైనా మంచిదని బెంగళూరు ఆసుపత్రి నుంచి కూడా వైద్యులను రప్పించామని చంద్రబాబు వివరించారు. వైద్యుల సలహాపై మరింత మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు తీసుకువచ్చినట్టు తెలిపారు.
రక్తప్రసరణలో ఇంకా గ్యాప్ లు వస్తున్నాయని, తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాలయ వైద్యులు పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. వైద్యులు ఏ చికిత్స చేయాలో నిర్ణయించి, ఆ దిశగా ముందుకుపోతారని చంద్రబాబు వివరించారు.