Chandrababu Naidu’s comments at Nagari: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా మంత్రి రోజా నియోజకవర్గం నగరిలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ… ఇక్కడొక జబర్దస్త్ ఎమ్మెల్యే ఉంది అంటూ విమర్శలుచేశారు. ఈ ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి ఏమైనా చేశారా అని ప్రశ్నించారు.
మున్సిపల్ కౌన్సిలర్ భువనేశ్వరి అనే అమ్మాయి తన వద్దకు వచ్చి తన గోడు వెళ్లబోసుకుందని చంద్రబాబు వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్ గా చేస్తామని ఆమె నుంచి రూ.40 లక్షల రూపాయలు తీసుకున్నారంటే వీళ్లను ఏమనాలి? అంటూ పరోక్షంగా రోజాపై ధ్వజమెత్తారు. ఇలాంటి పనిచేసిన వాళ్లకు మీరు ఓటేస్తారా? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా వేదికపై ఉన్న కౌన్సిలర్ భువనేశ్వరిని “ముందుకు రామ్మా” అంటూ చంద్రబాబు పిలిచారు. ఆమె వచ్చిన అనంతరం… ప్రజలు ఈ ఆడబిడ్డకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే తీరు ఇలా ఉంటే, ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్న జగన్ తీరు ఇంకెలా ఉంటుంది? అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నగరి నియోజకవర్గం అంతా అరాచకం అని మండిపడ్డారు.
మేము అధికారంలోకి వచ్చాక .. 60 రోజుల్లో మెగా డీఎస్సీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.”చదువుకున్న యువతకు ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? యువతకు ఉద్యోగాలు రావాలంటే ఎన్డీయేకు ఓటు వేయాలి. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చెప్పే వ్యక్తి జగన్. ఆయనో అబద్ధాల కోరు. బోగస్ సర్వేలు చేయిస్తారు. రాజకీయాలకు పనికిరాడు. పేదల మనిషి ఎవరో.. పెత్తందారు ఎవరో ప్రజలు తెలుసుకోవాలి.
మేం ప్రారంభించామనే అన్న క్యాంటీన్లు రద్దు చేశారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు తీసుకొస్తాం. టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెట్టారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే పొత్తు పెట్టుకున్నాం. కేంద్రంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుంది.
ఎవరికీ భయపడవద్దని, గేమ్ స్టార్ట్ అయ్యిందని అన్నారు. తన వద్ద డబ్బులు, ప్రైవేట్ సైన్యం లేవని అన్నారు. ఏడుకొండల వాడు అలిపిరి వద్ద తనను గతంలో కాపాడాడని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సభకు మైక్ కట్ చేశారని, తాను వైసీపీ తోకలు కట్ చేస్తానని అన్నారు.