AP Election 2024: ఈరోజు.. కర్నూలు జిల్లా ఆలూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. సాధారణ కార్యకర్తకు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన ఘనత టీడీపీది అని, ఒక ఎంపీటీసీని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టామని, ప్రజలంతా గెలిపించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర మార్చే కీలక తరుణమిదన్న చంద్రబాబు, టీడీపీ అభ్యర్థులను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు. ‘జగన్ పేరు మార్చి.. జే..గన్ రెడ్డిగా నామకరణం చేస్తున్నాను’ అని చంద్రబాబు అన్నారు
రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి, వైసీపీను చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అన్న చంద్రబాబు, కేంద్ర సహకారం కూడా రాష్ట్రానికి అవసరమని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని రూ.13 లక్షల కోట్ల అప్పులకుప్పగా వైసీపీ ప్రభుత్వం మార్చిందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, రాయలసీమకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తెచ్చారా, ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ప్రజల జీవితాలు బాగుపడ్డాయా, ఆదాయం పెరిగిందా, రైతులకు గిట్టుబాటు ధర వచ్చిందా అని నిలదీశారు.
వైసీపీ హయాంలో విద్యపై పెట్టిన ఖర్చు ఎంత అని, వచ్చిన ఫలితాలేంటని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు దోచింది ఎంత? దాచుకుంది ఎంతో చెప్పాలని నిలదీశారు. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేదల ఆరోగ్యాలతో ఆడుకునే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో అత్యంత ధనికుడు జగన్ అని, ఇష్టానుసారం భూములు దోచుకున్నారని విమర్శించారు.
జగన్ చేసే పనులకు, చెప్పే మాటలకు పొంతన ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ హయంలో దోపిడీ చేసి విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నారని, టీడీపీ హయాంలో సీమలో 90 శాతం రాయితీతో బిందు సేద్యం పరికరాలు ఇచ్చామని గుర్తు చేశారు. అనంతపురంలో కియా మోటార్స్ తీసుకువచ్చామన్న చంద్రబాబు, కడప విమానాశ్రయాన్ని తామే అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
మద్యపాన నిషేధం పేరుతో ప్రజలను జగన్ మోసగించారని, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారని ఏమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామన్న హామీ ఏమైందని, మాట తప్పిన జగన్‌కు ఓటు అడిగే హక్కు ఉందా అని అన్నారు.