Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. తన ప్రసంగాన్ని సర్దార్ గౌతు లచ్చన్న ప్రస్తావనతో ప్రారంభించారు. సర్దార్ గౌతు లచ్చన్న ఒక స్వాతంత్ర్య సమర యోధుడే కాకుండా, ప్రజల కోసం, రైతుల కోసం ఆ రోజుల్లోనే శ్రీకాకుళం నుంచి చెన్నైకి రైతు మార్చ్ నిర్వహించిన మహానాయకుడు అని కీర్తించారు.
ఆయన 1978లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌతు లచ్చన్న కూడా ఎమ్మెల్యేగా ఉన్నారని, ఆయన పట్టుదల తనను ఆకట్టుకునేదని వివరించారు. ఎప్పుడూ విశ్రమించకుండా, పేదల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి గౌతు లచ్చన్న అని స్పష్టం చేశారు. ఆయన కుమారుడిగా గౌతు శివాజీ ఈ నియోజకవర్గానికి ఎనలేని సేవలందించారని, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన గౌతు శిరీష ఎన్నో అవమానాలు ఎదుర్కొందని అన్నారు.
ఒక్కసారి ఎమ్మెల్యే అయినవారికే అన్ని తోకలు వస్తే, మూడు తరాలుగా రాజకీయాలు చేస్తున్నవారికి ఎంత పవర్ ఉండాలి? అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ పవర్ ఉపయోగిస్తే వైసీపీ నేతలు ఎంత? అది వీళ్ల తప్పు కాదు… పెద్ద సైకో చిన్న సైకోలను తయారుచేశాడని అన్నారు.
ఇక, ఆనాడు కింజరాపు ఎర్రన్నాయుడికి కేంద్రమంత్రి పదవి ఇచ్చామని వెల్లడించారు. యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు తండ్రికి తగిన బిడ్డ అని కొనియాడారు. రాష్ట్రంలో దొంగలుపడ్డారని, అందరం కలిసి కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ ఐదేళ్ల పాటు ప్రజలు అనేక బాధలు పడ్డారని వివరించారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు జనసైనికులు కూడా సిద్ధమయ్యారని తెలిపారు.
పడగొట్టి, చెడగొట్టి, భయపెట్టి, బాధపెట్టి, హింసించి ఆనందం పొందేవాడు ఈ జగన్ సైకో. తనకు తెలియదు. తెలిసినవాళ్లు చెబితే వినని మూర్ఖుడు. అఖండమైన మెజారిటీతో గెలిపిస్తే తనను తాను నిరూపించుకోకుండా అభివృద్ధిని పట్టించుకోకుండా, తనను తాను నిరూపించుకోకుండా సమయాన్నంతా ప్రతిపక్షాన్ని అణచివేయడానికే ఉపయోగించుకున్నాడు.
ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టి అప్పులు చేసి బటన్ నొక్కుతున్నాడు. బటన్ నొక్కడం పెద్ద పని అనుకుంటున్నాడు. మంచం మీద ఉన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయాన్ని పేదలకు పంచాలి, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. అదీ పరిపాలన. అమరావతి కోసం 35 వేల ఎకరాలు సేకరించి, రూ.10 వేల కోట్లతో భవనాలు నిర్మిస్తే… ఎవరికో పేరు వస్తుందని పాడుబెట్టిన వాడు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ సైకో ముఖ్యమంత్రి. నాకు పేరు వస్తుందని లక్షల టిడ్కోల ఇళ్లు పేదలకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు ఈ వ్యక్తి.
అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించి అదొక హీరోయిజం అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఏ రోడ్డుకైనా మట్టి వేశాడా, వ్యవసాయ శాఖ పనిచేస్తోందా, సాగునీటి శాఖ పనిచేస్తోందా, ఒక్క ప్రాజెక్టు కట్టాడా, విద్యాశాఖ పనిచేస్తోందా, ఆరోగ్య శాఖ పనిచేస్తోందా, ఆసుపత్రుల్లో మందులు ఉన్నాయా? ఏం చేశాడు? ఒక్క పని మాత్రం చేశాడు. సమాజంలో గాలోళ్లను పెంచాడు. ఇక్కడ కూడా ఒక గాలోడ్ని పెంచాడు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. అసలు గాలోడు ఇతనే. ఈ గాలోడ్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి గాలోళ్లను పెంచి లక్షల కోట్లు దుర్వినియోగం చేశాడు.
ఇది డ్రామా కాదు… నేను కూడా ఒప్పుకుంటున్నా. రాయో ఇంకేదో వచ్చింది… పడ్డది. ఆ పడిన వస్తువు అక్కడ ఉండాలి కదా! ఆ తగిలిన వస్తువు వెంటనే మాయం అయిపోయిందా? జగన్ వచ్చాడంట! కరెంటు పోయిందంట! అందుకు నేను బాధ్యుడ్నంట. ప్రభుత్వం నీదా నాదా? నీ ప్రభుత్వంలో కరెంటు పోతే నాదా బాధ్యత! నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు నన్ను తిట్టావు, ఇప్పుడు నీ ప్రభుత్వంలోనూ నన్ను తిడుతున్నావు. సరే కరెంటు పోయింది. బస్సు మీద ఎందుకు నిలబడ్డావ్? ఏం చేస్తున్నారు పోలీసులు. తీసుకుపోవాలి కదా లోపలికి!
నువ్వొక వీఐపీవి కదా, ముఖ్యమంత్రివి కదా, సెక్యూరిటీ సమస్య ఉంది కదా. వాడొక రాయి వేశాడంట.. ఇది జరిగిన ఐదు నిమిషాలకే బస్సు ముందు నాపై ప్లకార్డులు ప్రదర్శించారు. డ్రామా కాకపోతే ఏంటయ్యా ఇది! డ్రామా మాస్టరూ. నీ డ్రామాలన్నీ ప్రజలకు తెలిసిపోయాయి… ఇంకెవరూ నమ్మరు. ఈ డ్రామా కంపెనీలు డ్రామాలు మానెయ్యాలి… ప్రజల కోసం పనిచేయాలి. నీ మీద రాయేస్తే నేను ఖండించాను. నా మీద రాయేస్తే ఎప్పుడైనా నువ్వు ఖండించావా?