Homeతెలుగు Newsనాకు, కేసీఆర్‌కు మధ్య మోడీ చిచ్చు పెట్టారు: చంద్రబాబు

నాకు, కేసీఆర్‌కు మధ్య మోడీ చిచ్చు పెట్టారు: చంద్రబాబు

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఏర్పాటు చేసిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు ఏమిచ్చారని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఉన్న ఏ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. తనకు, కేసీఆర్‌కు మధ్య విభేదాలు సృష్టించేందుకు మోడీ ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీని అడ్డుపెట్టుకుని రాష్ట్రాలను బెదిరిస్తోందన్నారు. కేంద్ర సంస్థలను ఉసిగొల్పే సంప్రదాయం మంచిది కాదని ఎన్డీఏను హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను త్వరలోనే వంద రూపాయలు చేసేలా ఉందని ఎద్దేవా చేశారు. స్విస్‌ బ్యాంకుల్లోని డబ్బు తెచ్చి పేదల ఖాతాల్లో వేస్తామన్నారు.. ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు.

13 5

ఏపీతో పాటు తెలంగాణకు కూడా న్యాయం చేయాలని ఢిల్లీ నేతలను ఎన్నోసార్లు అడిగాను. తెలంగాణకు బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన వర్సిటీ మంజూరు చేయాలని అడిగాను. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలోని బీజేపీ అన్యాయం చేసింది. మనం ఏం తిండి తినాలో, ఎలాంటి దుస్తులు వేసుకోవాలో కూడా బీజేపీ చెబుతుందా? బీజేపీ పాలనలో యువతకు ఉద్యోగాలు రాలేదు. నోట్ల రద్దు వల్ల బ్యాంకులపై విశ్వాసం పోయింది. నాలుగున్నరేళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు ఏమైనా ఒరిగిందా? అని చంద్రబాబు మండిపడ్డారు.

అధికారం కోసం కాదు.. సిద్ధాంత పరంగా ముందుకు సాగుతాం. తెలుగుదేశం అమలు చేసిన సంస్కరణ వల్లే హైదరాబాద్‌కు ప్రపంచ గుర్తింపు వచ్చింది. అధికారం కోసం కాకుండా సిద్ధాంతం కోసం పోరాడే పార్టీ టీడీపీ అని మోదీ హైదరాబాద్‌ వచ్చి అడిగితే ఎన్డీయేతో కలిశాం. నా జీవితంలో ఎవరికీ భయపడలేదు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. తెలంగాణ గడ్డ మీద టీడీపీ ఉండటం చారిత్రక అవసరం. పార్టీ మారిన వారు కూడా మళ్లీ టీడీపీలోకి వస్తున్నారు. టీడీపీ తరఫున పోటీ చేయాలని చాలా మందికి ఉంది… సంతోషం. ప్రజల అభిప్రాయం మేరకు పార్టీ ముందుకెళ్లాలి. రాబోయే ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీనియర్‌ నేతలు దేవేందర్‌గౌడ్‌, పెద్దిరెడ్డి, గరికపాటి మోహనరావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, నామా నాగేశ్వరరావుతో పాటు పలు జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu