ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు చేతికి గాయమయింది. ఆయన విజయవాడలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సమయంలో ఆయన కుడిచేతికి కట్టు కట్టి ఉండడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో అసలేమైందా అని తెలుసుకునే ప్రయత్నం చేయగా ఆయన చేతి నరాలు వాపు వచ్చాయని తెలుస్తోంది. ఈ వాపు తగ్గి మళ్ళీ మామూలు స్థితికి రావాలంటే రెండు రోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని చెబుతున్నారు. వైద్యుల సూచన ప్రకారం ఈ సాయంత్రం హైదరాబాద్ వెళ్లి తన స్వగృహంలో రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్టు చెబుతున్నారు. చేతికి కట్టుతోనే సమావేశానికి హాజరయిన కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. నిజానికి అలిపిరి బ్లాస్ట్ సమయంలో కూడా చంద్రబాబు కుడి చేతికి గాయం అయ్యింది, కాలక్రమేణా అది మానినా ఎక్కువ ఒత్తిడి వలన ఏమైనా నరాలు వాచి ఉండచ్చని భావిస్తున్నారు. అయితే ఈ విషయం మీద పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.