సోమవారం సాయంత్రం కడప జిల్లా పులివెందులలో ఎన్నికల ప్రచార రోడ్‌షోలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు గర్జించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పులివెందులలో జగన్ ట్యాక్స్ నడుస్తోందని, రైతులు పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆరోపించారు. వీటన్నింటినీ అరికడతామన్నారు. ‘పులివెందులలో జీఎస్టీ మాదిరిగా జేఎస్టీ (జగన్ ట్యాక్స్) ఉంది. 20శాతం వసూలు చేస్తున్నారు. ఇలాంటి ట్యాక్స్ ఎక్కడా చూడలేదు. ఈ ఆటలు మా వద్ద సాగవు. ట్యాక్స్ వసూలుచేసే అధికారం ఎవరిచ్చారు? కష్టం రైతులది, దోపిడీ మాత్రం జగన్ వర్గానిది. నదుల అనుసంధానం పూర్తిచేసి రాయలసీమను రతనాల సీమ చేస్తా. పులివెందులను ఉద్యాన పంటల హబ్‌గా మారుస్తా. రైతులు పండించే పంటలను ప్రపంచం మొత్తం మార్కెటింగ్ చేయించే పూచీ నాది. శీతల గిడ్డంగులను నిర్మిస్తాం. పులివెందులకు నీళ్ల కోసం సతీశ్‌రెడ్డి పోరాటం చేశారు. పులివెందుల అభివృద్ధి కోసం జగన్ ఎప్పుడైనా మాట్లాడారా? వైసీపీ నేతలకు దోచుకోవడం తప్ప మరేదీ చేతకాదు. ప్రతి ఎకరానికి నీళ్లిచ్చే బాధ్యత నాది. ప్రతి రైతుకు గిట్టుబాటు ధర ఇస్తాం. బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ పేరుతో దగా చేసి జగన్ జైలుకెళ్లారు. కడప స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిచేస్తాం. జగన్‌కు ఎవరైనా ఓటేస్తే కేసీఆర్‌కు అధికారం ఇచ్చినట్టే. జగన్‌కు లోటస్‌పాండే ముద్దు.. ఇక్కడి ప్రజలతో నటిస్తారు. రాష్ట్రంలో ఉండని వారికి ఓటు అడిగే హక్కులేదు. మోడీ మళ్లీ గెలిస్తే మైనార్టీలు ఈ దేశంలో బతకలేరు. ఎంతో పోరాడి కియా మోటార్స్‌ను నేను ఏపీకి తీసుకొచ్చా. ప్రాణాంతకమైన యురేనియం పరిశ్రమను వైఎస్ తీసుకొచ్చారు. మేం మాత్రం ప్రజలకు ఉపాధి కల్పించే పరిశ్రమలు తెస్తున్నాం’ అని చంద్రబాబు అన్నారు.