టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక కొరత కృత్రిమమేనని ఆరోపించారు. ప్రతి పనిలోనూ జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని.. మద్యం నియంత్రించాల్సిన శాఖతోనే మద్యం అమ్మకాలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో చేపట్టిన ఇసుక దీక్షను చంద్రబాబు విరమించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయన ఈ దీక్షను కొనసాగించారు. ఆ తర్వాత భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చిన దీక్షను విరమింపజేశారు. దీక్ష ముగింపు సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. సీఎం జగన్‌కు డబ్బుపై వ్యామోహం ఎక్కువని.. బలవంతంగా ప్రజల ఆస్తులను రాయించుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదని వ్యాఖ్యానించారు. పేదవాడి ప్రాణాలు పోయినా.. వారి బతుకులు చితికిపోయినా సీఎం జగన్‌కు పట్టదని మండిపడ్డారు. ఇసుక కొరతపై పోరాడుతున్న రాజకీయ పార్టీలపై అధికారపక్షం ఎదురుదాడి చేస్తోందని ఆరోపించారు. రాజకీయం అంటే తమాషా అనుకుంటున్నారా? అని చంద్రబాబు దుయ్యబట్టారు.
ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కాలంతీరి చనిపోయారంటూ ఓ మంత్రి వ్యాఖ్యానించడం దారుణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల ఇంట్లో ఎవరైనా మృతిచెందితే అలాగే అంటారా అని ప్రశ్నించారు. పేదలు నాశనమైనా ఫర్వాలేదని.. తన అనుకునే వాళ్లు డబ్బు సంపాదించాలనే లక్ష్యంతోనే పేదల్ని బలి తీసుకుంటున్నారని ఆరోపించారు. 35లక్షల మంది కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవాడికి భోజనం పెట్టే ‘అన్న క్యాంటీన్’ను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. జగన్‌లాంటి కుటిల రాజకీయాలు చేసే వారిని కొన్ని వేలమందిని చూశానన్నారు. ఆయన కుట్రలు సాగవని హెచ్చరించారు. ఇద్దర్ని పార్టీ నుంచి తీసుకెళ్లి తనపై ఆరోపణలు చేయిస్తున్నారని.. ఒకరు వెళ్తే వందమంది నాయకులను తయారుచేస్తానన్నారు. కోడెల శివప్రసాదరావుపై బలమైన కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. ఎన్ని చట్టాలు వచ్చినా.. వీళ్లకు చుట్టాలేనని వ్యాఖ్యానించారు. ప్రజల ముందు వైసీపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతామని హెచ్చరించారు.