Chandra Babu: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ”వైసీపీ డీఎన్‌ఏలోనే శవరాజకీయం ఉందని, తండ్రి లేరు, బాబాయ్‌ని చంపారంటూ జగన్ ఓట్లు అడిగారని అన్నారు. రక్తంలో మునిగిన వైసీపీకి ఓట్లు వేయొద్దని జగన్ చెల్లెలు కూడా కోరుతున్నారు. హత్యలు, శవరాజకీయాలు చేసేవారు ప్రజలకు కావాలా? అందుకే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే మిత్రపక్షంతో వచ్చి కూటమిగా జట్టుకట్టామని చంద్రబాబు అన్నారు.
వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. కానీ, రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వొద్దు.. ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నా. మా ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు అన్నారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చే వీలున్నా కావాలనే పింఛనుదారులను సచివాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని అన్నారు. పెన్షన్ కోసం వెళ్లి సచివాలయానికి వెళ్లడం వల్ల కొందరు చనిపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. అవన్నీ ప్రభుత్వ హత్యలేనని.. జగన్‌పై పోలీసులు కేసు పెట్టి లోపల వేయాలని చంద్రబాబు మండిపడ్డారు. మనుషులను చంపి సానుభూతి కోసం వేరేవాళ్లపై నేరం మోపుతున్నాడని చంద్రబాబు దుయ్యబట్టారు.
వైసీపీ ఇవ్వలేకపోతే టీడీపీ వచ్చాక రూ.4వేల చొప్పున పింఛను ఇస్తామన్నాం. భయపడి నిన్న డబ్బులు విడుదల చేశారు. ప్రశ్నిస్తే గొడ్డలిని చూపి బెదిరిస్తున్నారు. మీ పార్టీకి గొడ్డలి గుర్తు పెట్టుకోండి.. కానీ, రాష్ట్రాన్ని శ్మశానం చేయొద్దు అంటూ తీవ్రస్థాయిలో జగన్‌పై చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో జనసేన రెండు చోట్ల పోటీ చేస్తోంది. ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. మిగిలిన ఐదుస్థానాల్లో ఒక సీటు బీజేపీకి ఇచ్చాం. దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఫ్యాన్‌ను ముక్కలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక సంపద సృష్టించి పేదలకు పంచుతాం. వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్ మద్యం ఉండవు. ఇసుక కొరత ఉండదు. విద్యుత్ ఛార్జీలు పెరగవు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం. రైతు కూలీల కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి వారిని ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నేను టిడ్కో ఇళ్లు ఇస్తే.. ప్రజల్ని జగన్ ఇబ్బందులకు గురి చేశాడు. మా ప్రభుత్వం ఏర్పాటు కాగానే పేదలకు రెండు సెంట్ల భూమి ఇస్తాం. ఇప్పటికే ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టించి మీ రుణం తీర్చుకుంటా”అని చంద్రబాబు చెప్పారు.