ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా బదిలీ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవలే ఇంటెలిజెన్స్ డీజీ సహా ఇద్దరు ఎస్పీలను బదిలీ చేశారని, ఇప్పుడు సీఎస్‌ను బదిలీ చేయడమేంటని ప్రశ్నించారు. మోడీ, అమిత్‌షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేరస్థులకు మోడీ కాపలాగాసే వ్యక్తి అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్న తనను ఏకాకిని చేసి ఇష్టప్రకారం దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడులు చేస్తున్నారని, ఏం చేశారో చెప్పకుండా అధికారులను ఎలా బదిలీ చేస్తారని నిలదీశారు. రేపో, ఎల్లుండో తనను కూడా అరెస్టు చేస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి విశాఖపట్నంలోని కంచరపాలెం రోడ్‌షోలో మాట్లాడారు.
‘ఇటీవల ఓ కలెక్టర్‌ను మార్చారు. మొన్న ఇద్దరు ఎస్పీలను, ఇంటెలిజెన్స్ డీజీని మార్చారు. ఏం తప్పు చేశారని మార్చారో, ఎందుకు మార్చారో చెప్పాలి. కారణం లేకుండా మార్చారు. ఎన్నికల కమిషన్ ఇష్టానుసారంగా చేయడం న్యాయమా? కేంద్ర ఎన్నికల సంఘం పద్ధతి ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి. పార్టీలకతీతంగా వ్యవహరించాలి. తెలంగాణలో 25లక్షల ఓట్లు తీసేశారు. ఎన్నికలు జరిగే చివరి క్షణంలో సారీ చెప్పారు. కోడికత్తి పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్తారు. తిరిగి మనం ఓట్లు తీసేశామంటారు. ఫారం7తో సుమారు 7లక్షలు ఓట్లు తీసేశారు. ఈ వ్యవహారంపై సిట్ వేశాం. నిందితుల్ని పట్టుకొనేందుకు ఆధారాలు ఇవ్వమంటే ఎన్నికల కమిషన్ మీనమేషాలు లెక్కిస్తోంది. ఏ తప్పూ చేయని సీఎస్, డీజీని బదిలీ చేస్తారా? ఏం చేస్తారో చేయండి. లెక్క చేయను. న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడుతున్నా. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎన్నికల కమిషన్లను చూశా. ఈవీఎంలను కూడా మానిప్యులేట్ చేసే అవకాశం ఉందని పోరాటం చేసి వీవీప్యాట్‌లను సాధించుకున్నాం. దేశంలో 22 పార్టీలు కలిసి 50శాతం వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కపెట్టాలని కోరితే వీలుకాదని ఈసీఐ చెబుతోంది. ఆ పనిచేయకుండా సీఎస్, డీజీ, ఎస్పీలను మారుస్తారు. కోడికత్తి పార్టీకి సహకరిస్తారు. నేరస్థులకు సహకరిస్తారు. మోడీ నన్ను బెదిరిస్తున్నారు. నన్ను భయపడమంటారా? ప్రజల కోసం పోరాడటం నా తప్పా. ఊడిగం చేయమంటారా? నేనెప్పుడూ నేరాలను ప్రోత్సహించలేదు’ అని చెప్పారు.
‘ఇష్టానుసారం దాడులు చేస్తే ఊరుకోం. ధర్మపోరాటం రాష్ట్రం కోసం చేశాను. భావితరాల కోసం చేశాను. నన్ను ఏకాకిని చేసి ఇష్టప్రకారం దాడులు చేస్తారా? ఎమ్మెల్యేలపై దాడులు చేస్తారా? మా మనోభావాలను దెబ్బతీస్తారా? సీఎస్, డీజీని బదిలీ చేస్తారా? రేపో, ఎల్లుండో నన్నూ అరెస్టు చేస్తారు. చేయండి. జైలులో ఉంటాగానీ భయపడే సమస్యలేదు. నేను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పోరాడాను. మోడీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఆర్బీఐ అన్నింటినీ నిర్వీర్యం చేసి ప్రతిపక్షాలను భయపెడుతున్నారు. ఇష్టానుసారంగా చేస్తే ఖబడ్దార్ మోడీ.. నీ ఆటలు సాగవని చెప్పాను. నాపై ఈసీని ప్రయోగిస్తారా? చూద్దాం. భయపడను. అమిత్‌షా వచ్చి నాకు డోర్లు క్లోజ్ చేశానంటున్నారు. నీ డోర్ ఎవరడిగారు. నిన్ను మా రాష్ట్రం నుంచి బహిష్కరించాం. నీ కుటిల రాజకీయాలు మా రాష్ట్రంలో సాగవు. భావితరాలు సైతం మిమ్మల్ని క్షమించవు. అమిత్‌షా, మోడీని శాశ్వతంగా ఏపీ నుంచి బహిష్కరిస్తాం’ అని చంద్రబాబు అన్నారు.