Chandrababu Naidu: ఏపీలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీనికోసం టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ బహిరంగ సభలు, అభ్యర్థుల ప్రకటనలు, తుదిజాబితాపై కసరత్తు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
‘రా.. కదలి రా’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఈ రోజు (సోమవారం) జరిగిన కాతేరు సభలో రాజానగరం టికెట్‌ను జనసేనకు ప్రకటించడంపై స్థానిక టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బొడ్డు వెంకట రమణ వర్గీయులు స్టేజిపై ఆందోళన చేశారు.
అనంతరం స్టేజిపై చిన్నపాటి తోపులాట చోటుచేసుకుంది. చంద్రబాబుపై కార్యకర్తలు పడబోయారు. అదేక్రమంలో పలువురు బొకేలు, పూలదండలు తీసుకుని వచ్చి చంద్రబాబుకు ఇవ్వబోయారు. ఈ తోపులాటలో చంద్రబాబు ఒకవైపుకు ఒరిగారు.
ఇదే సమయంలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై.. చంద్రబాబును పడిపోకుండా పట్టుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. దీంతో కార్యకర్తల తీరుపై చంద్రబు అసహనం వ్యక్తం చేశారు.