ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య ఘటనను జీర్ణించుకోలేకపోయారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో కోడెల చిత్ర పటానికి నివాళులర్పించిన చంద్రబాబు.. అనంతరం మాట్లాడుతూ.. కోడెల మృతి తనను తీవ్రంగా కలచివేసిందని.. కోడెల గురించి ఆయన మాట్లాడుతూ కన్నీరు కార్చారు. మానసిక క్షోభ, భరించలేని అవమానంతోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారన్న చంద్రబాబు.. 3 నెలలుగా కోడెలను వేధింపులకు గురిచేశారని.. భయం ఎరుగని వ్యక్తి అని.. అలాంటి వ్యక్తిని దారుణంగా వేధింపులకు గురిచేశారని అన్నారు. తెల్లారితే ఏం అవమానం చేస్తారో అని భయపడేంతగా హింసించి.. కోడెల ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని ఆరోపించారు చంద్రబాబు.
పార్టీ కార్యకర్తల హత్యలపై, రైతుల ఆత్మహత్యలపై పోరాటం చేశాం.. కానీ, కోడెల ఇలా ఆత్మహత్య చేసుకునే రోజు వస్తుందని ఊహించలేదన్నారు చంద్రబాబు. ఆయన నిత్యం ప్రజల క్షేమం కోసం పరితపించేవారన్న చంద్రబాబు.. రూపాయికే పేదలకు వైద్యం అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. వైద్య వృత్తిని వదిలి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటులో చొరవ తీసుకున్న మొదటి వ్యక్తి కోడెల అని.. కోటప్పకొండ అభివృద్ధిలో కోడెల పాత్ర ఎంతో ఉందన్నారు.