కేసీఆర్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుతానని చెప్పారని, తీరా రాష్ట్ర విభజన జరిగాక సోనియాను దుర్భాషలాడారని ధ్వజమెత్తారు. ఇప్పుడు మోడీ, కేసీఆర్, కోడికత్తి పార్టీ మూడూ కలిసి ఏపీపై దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. వంద మంది మోడీలు వచ్చినా తననేమీ చేయలేరని, తన జోలికొస్తే ఎవ్వర్నీ వదిలిపెట్టబోనని హెచ్చరించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో చంద్రబాబు మంగళవారం ఎన్నికల ప్రచార రోడ్ షో నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మాకూ కావాలని పట్టుబట్టిన కేసీఆర్, ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తానంటున్నారని ధ్వజమెత్తారు. మోడీకి ఓటేస్తే ముస్లింలకు భద్రత ఉండబోదని, ఇప్పటికే అసోంలో బర్మా ముస్లింలంటూ లక్షల ఓట్లను తొలగించారని ఆరోపించారు.
‘జగన్ ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆయన వస్తే పోలవరం ఆగిపోతుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కేసీఆర్ చేతిలోకి వెళ్లిపోతాయి. పోతిరెడ్డి పాడు, ముచ్చుమర్రి హెడ్ రెగ్యులేటరీలు మూతబడతాయి. అప్పుడు రాయలసీమకు చుక్క నీరు రాదు. కేసుల మాఫీ కోసం కేసీఆర్, మోదీ చెప్పినట్లు జగన్ ఆడతారు.’
‘ఎన్నికల ప్రచారం సాయంత్రానికి ముగియనున్న నేపథ్యంలో.. వైసీపీ నాయకులు అరాచకాలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. పసుపు చొక్కాలు వేసుకొని నేరాలకు పాల్పడతారని సమాచారం ఉంది. కేసీఆర్ పంపిన సొమ్మును పంచి ఓటర్లను కొనే ప్రయత్నం చేస్తారు. ఈ అరాచకాల పట్ల మీరంతా అప్రమత్తంగా ఉండాలి. నీతిమాలిన వ్యక్తి ఇచ్చే డబ్బులు మనకు అవసరమా? కేసీఆర్ ఏమీ చేయకుండా తెలంగాణలో 80కిపైగా సీట్లు గెలిచారు. ఇప్పుడు అన్ని ఎంపీ సీట్లు గెలుస్తారట! ఈ లెక్కన మనం ఎన్ని సీట్లు గెలవాలి? తెలంగాణ దగ్గర తలదించుకోవాలా మనం.’ అని సీఎం ప్రశ్నించారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగవద్దని సీఎం ప్రజలకు సూచించారు.