HomeTelugu Big Storiesలోటస్‌పాండ్‌లో కూర్చొని రాష్ట్రంలో కల్లోలం సృష్టించేందుకు కుట్ర: చంద్రబాబు

లోటస్‌పాండ్‌లో కూర్చొని రాష్ట్రంలో కల్లోలం సృష్టించేందుకు కుట్ర: చంద్రబాబు

8 6ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన రోడ్‌షో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారని, జిల్లాలోని అన్ని స్థానాల్లో టీడీనీను ఏకపక్షంగా గెలిపించారని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. అదే పోరాట స్ఫూర్తిని తాజా ఎన్నికల్లోనూ కొనసాగించాలని కోరారు. కాపు కార్పొరేషన్‌ కోసం టీడీపీ ప్రభుత్వం ఏడాదికి రూ.వెయ్యి కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. మీరంతా తనకు కాపు కాయాలని, అన్ని స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

హేతుబద్ధత లేని విభజనతో హైదరాబాద్‌ నుంచి కట్టుబట్టలతో పంపించేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకు కష్టం కలిగించలేదన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను ఏడాదిలోగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అమరావతిని అణగదొక్కాలని కేసీఆర్‌ చూస్తున్నారని, లోటస్‌పాండ్‌లో కూర్చొని రాష్ట్రంలో కల్లోలం సృష్టించేందుకు జగన్‌ కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రులపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని కేసీఆర్‌ను హెచ్చరించారు. గోదావరి-కృష్ణా నదులు అనుసంధానం చేశామని, పోలవరం పూర్తయితే అసలు నీటి కొరతే ఉండదని చంద్రబాబు పునరుద్ఘాటించారు. అమరావతిని ఆదర్శ నగరంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

‘నన్ను నమ్మి రైతులు 34 వేల ఎకరాల భూమి ఇచ్చారు. కోడికత్తి పార్టీ మేనిఫెస్టోలో రాజధానిపై ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. కేసీఆర్‌తో కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. పోలవరాన్ని నిలిపివేయాలని కేసీఆర్‌ కోర్టుకు వెళ్లారు. పోలవరం నిర్మిస్తే భద్రాచలం మునిగిపోతుందని కోర్టులో కేసు వేశారు. భద్రాచలాన్ని ఎలా కాపాడుకోవాలో మనకు తెలియదా? మన భద్రాచలం మనకు ఇవ్వమనండి. అభివృద్ధి చేసుకుందాం’ అని చంద్రబాబు అన్నారు. ఈ మధ్యకాలంలో రూ.15 లక్షల కోట్లు పెట్టుపడులు రాష్ట్రానికి వచ్చాయని, భవిష్యత్తులో 30 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని సీఎం తెలిపారు. అమ్మకు వందనం పేరుతో తల్లులను గౌరవిస్తామని, పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంటర్‌ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు. మహిళలకు శాశ్వతంగా రుణపడి ఉంటామని.. సేవచేసే ప్రభుత్వాన్ని ఆదరించే బాధ్యత మహిళలదేనన్నారు.

రైతు రుణమాఫీ నగదు రెండ్రోజుల్లో తీసుకోవచ్చని చంద్రబాబు తెలిపారు. పోలవరం ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలో 3 పంటలు పండించుకోవచ్చన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్ల బాధ్యత తీసుకుంటానని.. రూ.లక్ష సాయం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పెంచిన ఆదాయం.. ప్రజలకు పంచే కార్యక్రమం నిత్యం కొనసాగుతుందన్నారు. ఆరోగ్యరంగంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, గర్భిణులు నచ్చిన ఆస్పత్రిలో కాన్పు చేసుకునే సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గర్భిణులకు ఉచితంగా మందులు అందిస్తామన్నారు. మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారిని ఎస్టీల్లో చేర్చేందుకు కృషి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu