Homeతెలుగు Newsపార్టీ ముఖ్యనేతలతో కీలక అంశాలపై చంద్రబాబు చర్చ

పార్టీ ముఖ్యనేతలతో కీలక అంశాలపై చంద్రబాబు చర్చ

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు టీడీపీను దెబ్బతీసేందుకేనని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం అమరావతిలో ఆయన మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో కీలక అంశాలపై చర్చించారు. తమ రెండు పార్టీలూ రాజకీయంగా కలిసి పనిచేస్తే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయనే సంకేతాలను గతంలో తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపినా.. ప్రధాని మోదీ మాయలో పడిన ఆయన అందుకు అంగీకరించలేదని చంద్రబాబు అన్నట్టు సమాచారం. నేతలతో తాజా రాజకీయ పరిణామాలు, మావోయిస్టుల కదలికలపైనా ఈ సమావేశంలో చర్చించారు. బీజేపీ, వైసీపీ, జనసేన కలిసి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు తప్పవని నేతలకు దిశానిర్దేశం చేశారు. అలిపిరిలో తనపై దాడికి పాల్పడిన వారే కుట్రపూరితంగా అరకులో జంట హత్యలకు పాల్పడ్డారని అన్నారు.

9 1

అడుగడుగునా రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని సీఎం విమర్శించారు. ఢిల్లీ శివారులో రైతులపై దమనకాండపైనా చర్చించారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయితే, అధికారంలోకి వచ్చి ఏపీలో టీడీపీను దెబ్బతీయాలని బీజేపీ కేసీఆర్‌తో ఆడిస్తున్న నాటకంగా ఈ సమావేశంలో నేతలంతా అభిప్రాయపడినట్టు సమాచారం. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నామని సీఎం నేతలతో అన్నట్టు సమాచారం. చంద్రబాబు ప్రధాని అవుతారన్న కామెంట్లను ఎవరూ చేయొద్దని సూచించారు.

ఓటుకు నోటు కేసుపైనా ఈ భేటీలో చర్చ జరిగింది. ఓటుకు నోటు కేసు దర్యాప్తు చేయాలని తెలంగాణ అనిశా కేంద్రాన్ని కోరిందని ఓ మంత్రి అన్నట్టు తెలుస్తోంది. కేంద్రం ఆదేశాల మేరకే తెలంగాణలో ఐటీ దాడులు జరుగుతున్నాయని, ఏపీ విషయంలోనూ ఇదే తరహా దాడులు జరిగే అవకాశం ఉందని మరో మంత్రి అన్నారని సమాచారం. సీఎం, మంత్రులే లక్ష్యంగా కేంద్రం కుట్రలు పన్నుతోందని ఓ సీనియర్‌ నేత అన్నారు. తెలంగాణలో మహాకూటమి ఏర్పాటును కేసీఆర్‌ జీర్ణించుకోలేకపోతున్నారని ఓ మంత్రి అనగా.. బీజేపీ, జగన్‌, పవన్‌, కేసీఆర్‌ అంతా కలిసి టీడీపీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చంద్రబాబు అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu