అధికారులపై ఎన్నికల సంఘానికి అవినీతి పార్టీ ఫిర్యాదు చేస్తే విచారణ కూడా లేకుండా వారిని బదిలీ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. చివరికి ఎన్నికల పరిధిలో లేని అధికారులను సైతం బదిలీ చేశారని అన్నారు. ఇది అత్యంత దుర్మార్గమని అభివర్ణించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ‘వివేకానంద రెడ్డిని సొంత ఇంట్లోనే దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ఆ కేసును విచారణ జరుపుతున్న కడప ఎస్పీని సైతం బదిలీ చేశారు. మన ఇంట్లో ఇలాంటి ఘటన జరిగితే న్యాయం జరగాలని అందరం కోరుకుంటాం. చివరికి వివేకానందరెడ్డి భార్యను, కూతుర్ని కూడా బెదిరించి జగన్ తన అదుపులో పెట్టుకుంటున్నారు. జగన్‌కు మన పోలీసులపై నమ్మకం లేదు. తెలంగాణ పోలీసులపైనే ఉంది. అలాంటప్పుడు లోటస్‌పాండ్‌లోనే ఉండాలి. అక్కడే ఉండి కేసీఆర్‌కు ఊడిగం చేయాలి’ అని చంద్రబాబు అన్నారు.
‘బీజేపీ, వైసీపీ, టీఆర్‌ఎస్ ముగ్గురూ కలిసి కుట్రలు పన్నుతున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా నన్నేమీ చేయలేరు. ఈ ఐదేళ్లలో రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఓర్వకల్లుకు పారిశ్రామిక టౌన్‌షిప్, విమానాశ్రయం తీసుకొచ్చాను. ఇప్పుడు మనం పెట్టిన పరిశ్రమలతో 10 లక్షల ఉద్యోగాలు వస్తాయి. మరో 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా అవగాహన ఒప్పందాలు చేశాం. ఏపీలో యువకులందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
‘జగన్‌పై 31 కేసులు ఉన్నాయి. మొన్ననే ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నాపైన ఒకటే కేసు ఉంది. అదీ ఉత్తర తెలంగాణ కోసం పోరాటం చేసినందుకు బాబ్లీ ప్రాజెక్టు వ్యవహారంలో పెట్టారు. ఒక పెళ్లి సంబంధం కలుపుకునేటప్పుడే ఒకటికి పది సార్లు ఆలోచించి ముందుకెళ్తాం. అలాంటిది ఇన్ని కేసులు ఉన్న వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎందుకు ఎన్నుకోవాలి. ఆయన్ను శాశ్వతంగా లోటస్‌పాండ్‌కు పరిమితం చేయాలి. జగన్‌ను చిత్తుచిత్తుగా ఓడించండి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.