రాష్ట్రం పక్షాన ఉంటారో, అవినీతిపరుల పక్షాన ఉంటారో జనసేన అధినేత పవన్ తేల్చుకోవాలని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అవినీతి పరుడైన జగన్‌కు.. తనకు సమాన దూరం పాటిస్తామని పవన్ ఎలా అంటారని ప్రశ్నించారు. నేర చరిత్ర ఉన్న జగన్‌కు, తనకూ పోలికా? అని మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీకి తాను సమాన దూరమంటూ పవన్ ‘ఈనాడ’ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు విశాఖ జిల్లా నర్సీపట్నం ఎన్నికల ప్రచార రోడ్‌షోలో స్పందించారు. తన గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదన్నారు. తనకు అనుభవం ఉంది గనకే రాష్ట్ర ప్రజలకు నీతిమంతమైన పాలన అందించానన్నారు. అవినీతిని నిర్మూలించి.. టెక్నాలజీని అభివృద్ధి చేసినట్టు చెప్పారు. రాజకీయాలు చేస్తే తనకు బాధలేదని, తన కష్టాన్ని తక్కువగా అంచనా వేసి మాట్లాడటం బాధాకరమని వ్యాఖ్యానించారు.
టీడీపీకి ఓటేస్తే గెలుపు ప్రజలదేనని.. వైసీపీకి ఓటేస్తే మరణ వాంగ్మూలం రాసుకున్నట్టేనని సీఎం అన్నారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోబోమని హెచ్చరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినవన్నారు. తండ్రిని అడ్డుపెట్టుకొని రూ.లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. వైఎస్ వివేకా హత్య వారి ఇంట్లో జరిగితే గుండెపోటని చెప్పి ప్రజలను నమ్మించారని ధ్వజమెత్తారు. సాక్ష్యాలు తారుమారు చేశారు.. ఆధారాలు చెరిపేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 98 లక్షల మంది ఆడబిడ్డలకు పసుపు – కుంకుమ కింద ఆర్థిక సాయం చేశానన్నారు. ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని పాదయాత్రలో భరోసా ఇచ్చానని, రాష్ట్రంలో రూ.2వేల పింఛనుతో వృద్ధులు గౌరవంగా బతుకుతున్నారన్నారు. ఈ ఏడాది విశాఖ జిల్లాకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తుందని చెప్పారు. విశాఖ జిల్లాను గోదావరి నీటితో సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరు అడ్డుపడినా ఆగేది లేదు.. బుల్లెట్‌లా దూసుకెళ్తామన్నారు. చైనా, ఢిల్లీలో ఉండే కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చామని, దేశంలో తయారయ్యే మొత్తం ఫోన్లలో 30శాతం తిరుపతిలోనే తయారవుతున్నాయని చెప్పారు. నేరస్థుడికి రాష్ట్రాన్ని అప్పగిస్తే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? వైసీపీ వస్తే అందరిపై కేసులు పెట్టి జైళ్లకు తీసుకెళ్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా కేసీఆర్ ఆటంకాలు సృష్టిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.