జనసేన అధినేత పవన్‌కల్యాణ్.. మద్యం, ఇసుక, గనుల అక్రమార్జన సొమ్ముతో వైసీపీతో ఎన్నికలకు సిద్ధమైందని అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇసుక అక్రమ తవ్వకాలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, నదీ తీరంలో భారీ యంత్రాలతో చేస్తున్న దోపిడీపై నేతలకు పవన్ వివరించారు.
గుంటూరు జిల్లా పరిధిలోని కృష్ణా నదిలో అడ్డగోలుగా తవ్వేయడం వల్లే ఆ గుంతల్లో పడి సుమారు 26 మంది దుర్మరణం చెందారని చెప్పారు. రాష్ట్రంలో పర్యావరణాన్ని చెరపట్టి ఇసుకను దోచేస్తున్నారని మండిపడ్డారు. అధికార యంత్రాంగం కూడా అక్రమాలకు అడ్డు చెప్పకుండా మౌనంగా ఉండిపోవటం బాధాకరమన్నారు. అధికారులు కూడా ఇందుకు సంబంధించిన కేసుల్లో బాధ్యులవుతారని హెచ్చరించారు.
వైసీపీ పాలకులకు ప్రజా క్షేమం ఏనాడూ పట్టలేదని.. వారు అధికారంలోకి రాగానే ఇసుక దోపిడీ కోసం భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డునపడేశారని గుర్తు చేశారు. విలేకరి పరమేశ్వరరావుపై దాడి అప్రజాస్వామికమన్న పవన్.. ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా విలేకరి పరమేశ్వరరావుపై ఇసుక దొంగల దాడిని ఖండించారు. అడ్డగోలు ఇసుక దోపిడీని వెలుగులోకి తెస్తే ప్రాణాలు తీస్తారా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సీఎం అయిన నాటి నుంచి వైసీపీ అక్రమాలను ఎండగడుతున్న మీడియా ప్రతినిధులపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు.
పరమేశ్వరరావుపై దాడి చేసిన గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరగుతున్నాయని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలు ఎన్జీటీకి నివేదికలు ఇచ్చాయని, ఇంత జరగుతున్నా కలెక్టర్లు కూడా పట్టనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. అధికార వైసీపీ ఇసుక మాఫియాపై భవిష్యత్తులో చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు.