టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నామని బాధపడొద్దని.. ప్రజల సమస్యల పరిష్కారానికి పాటు పడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సొంత నియోజకవర్గం పర్యటనలో భాగంగా రెండో రోజు గుడుపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వరుసగా ఏడుసార్లు తనను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పోరాటంతో ముందుకెళ్లడమే తప్ప వెనుతిరగడం తనకు తెలియదన్నారు. తాను ఎక్కడా ఏతప్పూ చేయలేదని.. ఐదేళ్ల పాటు రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా కష్టపడ్డానని చెప్పారు. రాష్ట్రంలో సంపదను సృష్టించి ఫలితాలను అందరికీ పంచానన్నారు. సంక్షేమ పథకాలతో మనిషి ప్రతీ దశలో తోడు ఉండేలా ప్రణాళికలు తెచ్చామని చెప్పారు. కుప్పం కంటే ముందు పులివెందులకే నీళ్లిచ్చామని.. ఒత్తిడి తెచ్చి అయినా హంద్రీనీవా నీళ్లు కుప్పానికి తీసుకువస్తానని చంద్రబాబు అన్నారు. హెచ్‌సీఎల్ వంటి కంపెనీలు అమరావతికి వచ్చేలా చేశానన్నారు. కరవు జిల్లా అనంతపురానికి నీళ్లు ఇచ్చి కియా మోటార్స్ తీసుకొచ్చానని చెప్పారు. 13 బృందాలను నియమించి కార్యకర్తల ఆవేదనను తెలుసుకుంటామని చంద్రబాబు చెప్పారు. కార్యకర్తలు, ప్రజల సంక్షేమమే తొలి ప్రాధాన్యంగా పనిచేస్తానని చంద్రబాబు చెప్పారు.