Chandra Babu: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. పోటా పోటీగా రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోతున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాగళం పేరుతో రోడ్‌షోలు, సభలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు కర్నూలు జిల్లా బనగాన పల్లెలో ప్రజాగళం యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేతలు అంతా వేడుకలు జరుపుకున్నారు. టీడీపీని నందమూరి తారక రామారావు స్థాపించి ఇప్పటికి 42 వసంతాలు పూర్తిచేసుకుంది. టీడీపీ కార్యాలయాల్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు కేక్ కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు.
బనగానపల్లెలో చంద్రబాబు మాట్లాడుతూ పాలనలో ఎన్టీఆర్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు, మహిళలకు ఆస్తిలో హక్కును కల్పించారని అన్నారు. రాజకీయ, పారిశ్రామిక విప్లవానికి టీడీపీ నాంది అని, జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని గౌరవం టీడీపీకి దక్కిందని చంద్రబాబు అన్నారు. సంపద సృష్టించి దాన్ని పేదలకు పంచాలనేదే టీడీపీ ధ్యేయమని అన్నారు. ప్రస్తుతం మనం వాడుతున్న టెక్నాలజీ టీడీపీ చొరవ వల్లే వచ్చిందని అన్నారు.
మూడు రాజధానులు ఏర్పాటు చేశానని జగన్ సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని, మూడు రాజధానులు తెచ్చాడా అని ప్రజలను ప్రశ్నించారు. జగన్ 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నాడని మండిపడ్డారు. ఆంధ్రులకు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ అని దుయ్యబట్టారు. ఓ దుర్మార్గుడిని ఓడించేందుకు అందరూ ఏకమయ్యామని అన్నారు. మాది విజన్ అయితే జగన్‌ది పాయిజన్ అని చంద్రబాబు అన్నారు.
జగన్ పనిదొంగ.. దోపిడీ దారు.. మోసం చేయడమే జగన్ పని.. ఆదుకోవడమే నా పని.. ఫ్యాన్‌ను చెత్తకుండిలో పడేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదని చంద్రబాబు అన్నారు. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని.. ఎంతమందికి జగన్ ఉద్యోగాలిచ్చాడో చెప్పగలరా అని ఛాలెంజ్ విసిరారు. జగన్ హయాంలో 102 ప్రాజెక్టులను రద్దు చేశారని, బీసీ, ఎస్సీలకు చెందిన అనేక సంక్షేమ పథకాలను రద్దు చేశారని మండిపడ్డారు.
వాలంటీర్ ఉద్యోగాల గురించి చంద్రబాబు మరోసారి స్పందించారు. వాలంటీర్ వ్యవస్థను తొలగించబోనని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే వాలంటీర్ ఉద్యోగాలు గ్యారంటీ అని, వైసీపీతో కలిసి రాజకీయాలు చేస్తే మాత్రం సహించేది లేదని అన్నారు. వాలంటీర్లలో విద్యావంతులకు రూ.5 వేలకంటే ఎక్కువ వచ్చే మార్గం చూపిస్తానని అన్నారు.