ఢిల్లీలో గురువారం కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు కీలక సమాలోచనలు జరగనున్నాయి. ‘సేవ్ నేషన్’ నినాదంతో బీజేపీయేతర పార్టీలన్నింటనీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ వారంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం రెండోసారి కానుంది. బీజేపీయేతర కూటమి ఏర్పాటులో కీలక అడుగులు వేస్తున్న చంద్రబాబు మొన్న జరిగిన పర్యటనలో పలువురు జాతీయ స్థాయి నాయకులతో భేటీ అయ్యారు. దీనికి కొనసాగింపుగానే రేపటి ఢిల్లీ పర్యటన కొనసాగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఈ రోజు మధ్యాహ్నం అమరావతిలోని సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసిన చంద్రబాబు వారితో కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌తో భేటీ అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. రేపటి ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు రాహుల్‌ను కలిసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై వడివడిగా అడగులు వేయాలని చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలోనే ఆయన రాహుల్‌తో భేటీ కానున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తదితరులతో భేటీ కానున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా ఈ భేటీ కీలకం కానుంది. అలాగే, బీజేపీయేతర కూటమి ఏర్పాటుపైనా రేపు ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.