వైసీపీ నాయకురాలు షర్మిలపై జరుగుతున్న దుష్ప్రచారంతో తనకుగానీ, టీడీపీ నేతలకుగానీ సంబంధం లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. టీడీపీపైన, తనపైన షర్మిల ఎందుకు ఆరోపణలు చేశారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేకనే తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు షర్మిల చేసిన వ్యాఖ్యలను, తనపై జరిగిన దాడి కేసు విషయంలోనూ ఏపీ పోలీసులపై నమ్మకం లేదని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ‘ఏపీ పోలీసుల మీద నమ్మకం లేనప్పుడు ఏపీలో రాజకీయం ఎలా చేస్తారు? వైసీపీ నేతలు ఇక్కడ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారు? ఏపీలో ఉంటూ, ఏపీలో రాజకీయ పార్టీ నడుపుతూ ఏపీలో వ్యవస్థపై నమ్మకం లేదంటారా?’ అని మండిపడ్డారు.
ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటే ఈ రాష్ట్ర పౌరులుగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. జగన్‌పై దాడి కేసును ఎన్‌ఐఏకి అప్పగించడంపై కోర్టుకు వెళ్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక.. మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు చేస్తున్న ఆరోపణలపై చంద్రబాబు స్పందిస్తూ.. తన వ్యక్తిత్వం గురించి అందరికీ తెలుసని అన్నారు. 40 ఏళ్లుగా నీతివంతమైన రాజకీయాలకే కట్టుబడి ఉన్నానని గుర్తుచేశారు. ఎవరి చేత ఒక్క మాట కూడా పడకుండా వ్యవహరిస్తూ వచ్చానని బాబు చెప్పారు.