హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. కూకట్‌పల్లి టీడీపీకి కంచుకోట అని.. సైబరాబాద్ తన మానసపుత్రిక అని.. బిడ్డలా అంచలంచెలుగా అభివృద్ధి చేసి ప్రపంచపటంలో పెట్టానని చంద్రబాబు అన్నారు. దీనిలో కేసీఆర్ పాత్ర ఉందా..? కేటీఆర్ పాత్ర ఉందా..? అని ప్రశ్నించారు. నా తొమ్మదేళ్ల హయాంలో దీనికి ఒక రూపు వచ్చింది.
ఇది నేను మెచ్చిన నగరం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఫ్లైఓవర్ కట్టారా..? హైటెక్ సిటీ, సైబరాబాద్, ఫైనాన్షియల్ సిటీ, ఎయిర్‌పోర్టు వంటివి తీసుకొచ్చాను. కేసీఆర్ నాలుగున్నరేళ్లలో ఏం చేశారు. ప్రగతి భవన్, ఫాంహౌస్ కట్టుకున్నారు అని విమర్శించారు. హైదరాబాద్ నేను కట్టలేదు.. కులీకుతుబ్‌షా కట్టారు. నేను సైబరాబాద్‌ను
నిర్మించానని చంద్రబాబు వివరించారు. హైదరాబాద్ నేను కట్టానని కొందరు అవహేళన చేస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ ఈ గడ్డపైనే తెలుగుదేశం పార్టీని పెట్టారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది అని చంద్రబాబు తెలిపారు.
దేశం, తెలంగాణ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నాయని, దేశాన్నిమోడీ భ్రష్టు పట్టించారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, జీఎస్టీతో చిన్న చిన్న వ్యాపారులు పూర్తిగా దెబ్బతిన్నారని ఆరోపించారు. తెలుగు జాతికి మోడీ ద్రోహం చేశారని దుయ్యబట్టారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని.. 35 ఏళ్లు కాంగ్రెస్‌తో పోరాడాం. దేశ భవిష్యత్తు కోసం ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. అందరూ కలిసి ప్రజాకూటమి ఏర్పాటు చేయడంతో టీఆర్‌ఎస్‌కు ఓడిపోతామనే భయం పట్టుకుందని అన్నారు. కేసీఆర్ తెదేపాలో నాతో కలిసి పనిచేశారు. ఇప్పుడు నన్నే ఇక్కడకు ఎందుకు వచ్చావని అంటున్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అందరినీ భయపెట్టారు. నరేంద్ర మోడీ సీనియర్ అయితే.. కేసీఆర్ జూనియర్ మోడీ అని దుయ్యబట్టారు.