టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఏడాది భోగి పండుగను వినూత్నంగా జరుపుకున్నారు. అమరావతిలో 28 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులతో కలిసి చేసుకున్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో నేతలు భోగి మంటలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. ప్రజలు కష్టాల్లో ఉన్నా సంప్రదాయాన్ని కాపాడాలి కాబట్టి భోగి పండుగ జరుపుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాజధాని ఏర్పాటుపై జిఎన్ రావు, బోస్టన్ కమిటీల పత్రాలను భోగి మంటల్లో వేసి నిరసనలు తెలిపారు.
‘భోగి మంటల్లో కమిటీ నివేదికలను వేసి పీడ వదిలించుకుంటున్నాం. అమరావతి తరలింపు సునామీ వంటిది. దీనికి సహకరించిన ఏ రాజకీయ పార్టీ అయినా ఆ తుపానులో కొట్టుకుపోవడం ఖాయం అని చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉంది. మూడు రాజధానుల అంశంపై రెఫరెండం పెట్టాలి. అమరావతికి ఘన చరిత్ర ఉందని దాని చారిత్రక ప్రాధాన్యాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి. పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. రాజధాని కూడా ఒక్కటే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏపికి మూడు రాజధానులు ప్రతిపాదనను విరమించుకోవాలని వారంతా డిమాండ్ చేశారు. పండగలకు గ్రామాలకు వెళ్లే సంప్రదాయం ఉంది. మొదటిసారిగా మా ఊరికి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నాం. అమరావతిని కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తాం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.