వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో జరిగిన దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడం రాష్ట్రం అధికారాల్లోకి కేంద్రం చొరబడటమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిపై రాజ్యాంగపరమైన చర్చ జరగాల్సి ఉందన్నారు. ప్రకాశం జిల్లా రామాయపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్‌ఐఏ చట్టం వచ్చినపుడు వ్యతిరేకించిన ప్రధాని మోడీ ఇప్పుడు ఆ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని సీఎం దుయ్యబట్టారు. ఎవరినో కొట్టాను అంటూ తనపై కూడా కేసులు నమోదు చేస్తారేమో అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి లేని పాదయాత్రలు ఎన్ని చేసినా ఉపయోగం లేదని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాదయాత్ర అంటే నిబద్ధతతో చేయాలని, రోజుకు 8కి.మీ మేర నడిస్తే దాన్ని పాదయాత్ర అంటారా? అని ప్రశ్నించారు. గతంలో ఆరోగ్యం సహకరించకపోయినా తాను నడిచి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించానని సీఎం చెప్పారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లను స్వాగతిస్తున్నామన్నారు. కాపు రిజర్వేషన్లతో పాటు తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను ఎందుకు ఆమోదించలేదని.. ఇప్పుడే అగ్రవర్ణాల రిజర్వేషన్లు గుర్తొచ్చాయా అని చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించారు. బీజేపీ వ్యతిరేక కూటమిని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.