టాలీవుడ్‌లో ‘ఆర్‌ఎక్స్100’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. ఆ ఒక్క సినిమాతో కార్తికేయ యూత్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నాడు. తొలి నుంచి వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నాడు. తాజాగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా..’. ఈ సినిమా శుక్రవారం (మార్చి 19)విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో హైప్ క్రియేట్ అయింది.
కథ: బస్తీ బాలరాజు (కార్తికేయ) శవాలను మోసుకెళ్లే వాహన డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. సిటీలో ఎవరైనా చనిపోతే తన వాహనంలో స్మశానానికి తీసుకెళ్లి, వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుంటాడు. అతని తల్లి గంగమ్మ(ఆమని) మార్కెట్లో మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది. ఇదిలా ఉంటే ఒక రోజు ఒక శవాన్ని శ్మనానవాటికకు తరలించాలని బాలరాజుకు ఫోన్ కాల్ వస్తుంది. అక్కడికి వెళ్లిన బాలరాజు భర్తను కొల్పోయిన యువతి మల్లిక(లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు. అంత్యక్రియల సమయంలోనే మల్లికను పెళ్లి చేసుకుంటానని వారి బంధువుల ముందే చెప్తాడు. కానీ దానికి మల్లికతో పాటు ఆమె అత్తమామలు కూడా నిరాకరిస్తారు. అయినప్పటకీ బాలరాజు మల్లిక వెంటపడుతూనే ఉంటాడు. కట్ చేస్తే.. టీవీలు రిపేరు చేసే మోహన్(శ్రీకాంత్ అయ్యంగార్)తో గంగమ్మ చనువుగా ఉండటం చూసి బాలరాజు బాధపడతాడు. ఈ వయసులో తన తల్లి మరో వ్యక్తితో వివాహయేతర సంబంధం కొనసాగించడం నచ్చక తల్లిపై కోపం పెంచుకుంటాడు. తన తల్లి కంటే భర్తను కోల్పోయిన మల్లిక చాలా గొప్పది అని భావిస్తాడు. అసలు గంగమ్మ మరో వ్యక్తితో ఎందుకు చనువుగా ఉంది? భర్తను కోల్పోయిన మల్లిక ప్రేమను బస్తీ బాలరాజు ఎలా దక్కించుకున్నాడు? అనేదే కథ.
నటీనటులు: కార్తికేయ తన పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా భారాన్ని తన భుజాల మీద వేసుకొని మెప్పించాడు. ఎమోషనల్ సీన్లలో కూడా అద్భుతంగా నటించాడు. ఇక భర్తను కోల్పోయిన మల్లిక పాత్రలో లావణ్య త్రిపాఠి అద్భుతంగా నటించింది. పూర్తి డీ గ్లామరైజ్డ్ పాత్ర ఆమెది. ఇక కార్తికేయ తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర ఆమనిది. గంగమ్మ ఆమె జీవించేశారని చెప్పొచ్చు. గంగమ్మ క్యారెక్టరైజేషన్ సినిమాకు చాలా ఫ్లస్ పాయింట్. కోడలి మేలు కోరే మామ పాత్రలో మురళీశర్మ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం తదితరులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు.
విశ్లేషణ: చావు నుంచి తప్పించుకోలేమనేది జగమెరిగిన సత్యం. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు చావక తప్పదు. అలా అని చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి రోజు బాధపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భర్తను కోల్పోయిన మహిళలు అయితే ఇక తమ జీవితం ఇంతే అనుకుంటూ అదే బాధలో ఉంటారు. కానీ అదే జీవితం కాదు. పోయినవారిని ఎలాగో తీసుకురాలేము. ఉన్నవారిని సంతోషంగా చూసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలి. అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. ఇదే విషయాన్ని ‘చావు కబురు చల్లగా’ సినిమాతో చెప్పాలనుకున్నాడు దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి. తొలి చిత్రంతోనే ఓ కొత్త కాన్సెప్ట్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేశాడు.
ఫస్టాఫ్ అంతా రోటీన్ కామెడీతో నడిపించి ప్రేక్షకుడికి సహనానికి పరీక్ష పెట్టాడు. బాలరాజు మల్లిక వెనుకపడే సన్నివేశాలు కూడా నత్తనడకగా, రొటీన్‌గా అనిపిస్తాయి. ఇక సెకండాఫ్ మాత్రం పర్వాలేదనిపిస్తుంది. హీరో తల్లి మరో వ్యక్తితో ఎందుకు చనువుగా ఉందో వివరించిన తీరు ప్రశంసనీయం. కొన్ని ఎమోషనల్ సీన్లు బాగా పండించారు. అలాగే భర్తను కోల్పోయిన యువతని హీరో ప్రేమించడం అనే అంశం కొత్తగా అనిపిస్తుంది. సినిమాలోని పాటలు అలరించడంతో పాటు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.
టైటిల్: చావు కబురు చల్లగా
నటీనటులు: కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం తదితరులు
దర్శకత్వం: కౌశిక్ పెగళ్లపాటి
నిర్మాత : బన్నీవాసు
సంగీతం: జాక్స్ బిజోయ్
హైలైట్స్: కార్తికేయ, లావణ్య, ఆమని నటన
డ్రాబ్యాక్స్: కొన్ని సన్నివేశాలు
చివరిగా: కార్తికేయ కొత్త ప్రయత్నం ‘చావు కబురు చల్లగా’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)