బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస మరణాలు అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు స్టార్ నటులు మరణించగా.. ఈరోజు మరో ప్రముఖ నిర్మాత కన్నుమూశారు. దాంతో బాలీవుడ్ కు మరోసారి షాక్ తగిలింది. ప్రముఖ నిర్మాత – టెలివిజన్ అండ్ గిల్డ్ ఆఫ్ ఇండియా సీఈవో కుల్మీత్ మక్కర్ మరణం బాలీవుడ్ ని దిగ్ర్బాంతిలోకి నెట్టేసింది. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుల్మీత్ శుక్రవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల ట్విటర్ వేదికగా తమ నివాళి ప్రకటించారు. నివాళులు అర్పించిన వారిలో బాలీవుడ్ నటి విద్యాబాలన్, ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్, దర్శకులు హన్సల్ మెహతా, సుభాష్ గాయ్ తదితరులు ఉన్నారు. హీరోయిన్ విద్యాబాలన్ స్పందిస్తూ.. ‘షాకింగ్ న్యూస్. ఇండస్ట్రీకి మీరు అందించిన సేవలు ఎప్పటికి గుర్తుంచుకుంటాం. మా కన్నీటితో ఇవే మీకు మా ఘన నివాళులు. మీ కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు.