ఎప్పటిలాగానే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ ఏడాది కూడా తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది. అసలే ఆర్థికమాంద్యం. రాష్ట్రాల బడ్జెట్ అంతా సంక్షేమ పథకాలు, పెండింగ్ ప్రాజెక్టులకే సరిపోతుంది. దీంతో కేంద్ర బడ్జెట్‌పై ఏపీ, తెలంగాణ భారీగా ఆశలు పెట్టుకున్నాయి. కాళేశ్వరం ప్రస్తావన లేదు. పోలవరానికి నిధులు లేవు. విభజన
హామీలపై ప్రకటన లేదు. కనీసం కేంద్ర సంస్థల కేటాయింపుల ఊసే లేదు. బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు, మినహాయింపులు ఇవ్వాలని కేంద్రానికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు పంపాయి. కేంద్రం ఇవేవీ పట్టించుకోలేదు. కనీసం ఎక్క ఎక్స్ ప్రెస్ హైవేను కూడా ఇవ్వలేకపోయింది. బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటకు మాత్రం వరాలు కురిపించింది. 2 వేల కిలోమీటర్ల చెన్నై-బెంగుళూరు హైవే నిర్మిస్తామని హామీ ఇచ్చింది. బెంగుళూరులో రూ.18వేల కోట్లతో మెట్రో తరహా సబర్బన్ రైల్వే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్‌కు భారీగా నిధులు కేటాయించింది. కానీ తెలుగు రాష్ట్రాలకు రైల్వేల్లోనూ నిరాశే ఎదురైంది.
కేంద్ర బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, కేంద్రం మొండిచేయి చూపించిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బడ్జెట్లో ఏపీ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావనే లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణను సైతం బడ్జెట్లో నిర్లక్ష్యం చేశారని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆరోపించింది. బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి రాయితీలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ట్రైబల్ మ్యూజియం విషయంలోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. బడ్జెట్‌పై పార్లమెంటులో చర్చలో కేంద్రాన్ని నిలదీస్తామని తెలుగు రాష్ట్రాల ఎంపీలు చెబుతున్నారు.