Homeపొలిటికల్AP Politics: తెలంగాణలో జరిగిందే ఏపీలోనూ జరగబోతుందా?

AP Politics: తెలంగాణలో జరిగిందే ఏపీలోనూ జరగబోతుందా?

AP Politics AP Politics,ap,tdp,ysrcp,AP CM Jagan

AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారుతున్న ఈ సమయంలో ఇంతకాలం ప్రభుత్వ శాఖలు వినియోగించిన “ఈ-ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌”ని అప్‌గ్రేడ్ చేస్తుండటంపై  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేశారు. జగన్‌ ప్రభుత్వం అనేక అవినీతి, అక్రమాలకు, అడ్డుగోలు పంపకాలు, నిర్ణయాలు తీసుకుందని కనుక వాటికి సంబందించిన సాక్ష్యాధారాలు లభించకుండా నాశనం చేసేందుకే ఈ సమయంలో ‘ఈ-ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌’ అప్‌గ్రేడ్ చేస్తోందని, కనుక అలా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు నాయుడు గవర్నర్‌ని కోరారు.

తెలంగాణలో ప్రభుత్వం మారుతున్న సమయంలో కొన్ని శాఖల కార్యాలయాల్లో ఫైళ్లు మాయమైన సంగతి తెలిసింది. కొన్నిచోట్ల ఫైళ్లు తగలబెట్టిన ఘటనలు జరిగినట్లే ఇప్పుడు ఏపీలో కూడా జరుగబోతోందని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలా జరగకుండా అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశారు. అమరావతిలో సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ బయటకు తీసుకెళ్ళకూడదని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని చంద్రబాబు నాయుడు గవర్నర్‌కి విజ్ఞప్తి చేశారు.

అన్ని డాక్యుమెంట్స్ హార్డ్ కాపీలు, సాఫ్ట్‌ కాపీలు భద్రపరచాలని సీఎస్ జవహార్ రెడ్డిని ఆదేశించాలని గవర్నర్‌ని కోరారు. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని జగన్‌ ధీమా వ్యక్తం చేసినప్పటికీ, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే తమపై ప్రతీకారం తీర్చుకుంటుందని జగన్‌తో సహా వైసీపిలో అందరికీ తెలుసు. కనుక తమ అవినీతి, అక్రమాలకు సంబందించి సాక్ష్యాధారాలు సంకీర్ణ ప్రభుత్వం చేతిలో పడకుండా అందరూ ముందే జాగ్రత్త పడతారు. కొన్ని రోజుల క్రితమే తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలోకి ఓ పోలీస్ కంటెయినర్ ఎటువంటి తనిఖీలు లేకుండా వెళ్లి.. కొంతసేపటి తర్వాత బయటకు వెళ్ళిపోయింది.

దానిపై మీడియా, ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేసినా జగన్‌ ప్రభుత్వం స్పందించలేదు. ఆ పోలీస్ కంటెయినర్ వాహనం ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ఎందుకు వచ్చింది? ఏమి తీసుకువెళ్ళింది? ఎక్కడకు తీసుకు వెళ్ళింది?అనే ప్రశ్నలకు ఇంతవరకు సమాధానమే ఇవ్వలేదు. అంతకు ముందు తాడేపల్లిలోని పాతూరు రోడ్డులో గల సిట్ కార్యాలయంలో సిబ్బంది అనేక కాగితాల కట్టలకు మంట పెట్టి తగులబెట్టారు. కనుక మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలలో కూడా కీలకమైన పత్రాలు, ఫైల్స్ మాయం చేయవచ్చని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేస్తున్నారనుకోవచ్చు.

అప్‌గ్రేడేషన్ పేరుతో కీలక జీవోలు మాయం చేస్తే ఎవరు బాధ్యులు అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలోనూ సీఎంవోలో డిజిటల్ సిగ్నేచర్లు దుర్వనియోగం అయ్యాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అనేక అవకతవకల నేపథ్యంలో ఫైళ్ల భద్రతపై అనుమానాలు నెలకొన్నాయని అంటున్నారు. గతంలో సీఎంవోలో డిజిటల్ సిగ్నేచర్‌ను దుర్వినియోగం చేసి సీఎంవోలో దాదాపు 60 ఫేక్ సీఎంపీలను తయారుచేసిన చరిత్ర ఉందని ఆరోపిస్తున్నారు. సీఎంవోలోనే పదుల సంఖ్యలో అనామకులు ఫైళ్లను క్లియర్ చేసిన సందర్భాలు ఉన్నాయని అంటున్నారు. “ఈ-ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌”ని అప్‌గ్రేడ్ పేరుతో ఫైళ్లు తారుమారయ్యే అవకాశం ఉందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.

ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు చంద్రబాబు లేఖ రాసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ-ఆఫీస్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ చేయడాన్ని వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ బృందానికి ఆ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu