టీఆర్‌ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు సినీ ప్రముఖులు, నెటిజన్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్‌బాబు, రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ, మంచు మనోజ్, అడివి శేష్ తదితరులు సోషల్‌మీడియా ద్వారా ఆయన్ను విష్ చేశారు. వీరందరికీ ఆయన తిరిగి ధన్యవాదాలు చెప్పారు. ‘జన్మదిన శుభాకాంక్షలు కేటీఆర్. ఈ ఏడాది మీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా’ అని మహేష్ ట్వీట్ చేశారు. ఆయనకు కేటీఆర్ తిరిగి ధన్యవాదాలు తెలిపారు.
‘ప్రియమైన కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలానే డైనమిక్ నాయకుడిగా కొనసాగండి. మీ జీవితం సంతోషం, విజయంతో నిండాలని కోరుకుంటున్నా’ అని చెర్రీ ఫేస్‌బుక్‌లో చిరంజీవి, కేటీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.
‘ప్రజల వ్యక్తి, పర్‌ఫెక్ట్ నాయకుడు, ముక్కుసూటిగా మాట్లాడే కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు అన్నా’ అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ‘ధన్యవాదాలు బడ్డీ, ఈసారి సంగారెడ్డిలో మాకు ఓటు వేయండి (నవ్వుతున్న ఎమోజీ)’ అని పోస్ట్ చేశారు. దీనికి మనోజ్ ప్రతి స్పందిస్తూ.. ‘ఈసారి తిరుపతిలో నా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నా అన్నా’ అని నవ్వుతున్న ఎమోజీని షేర్ చేశారు.
‘పుట్టినరోజు శుభాకాంక్షలు రామన్నా’ అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ‘చాలా థాంక్స్ కామ్రేడ్ విజయ్’ అని కేటీఆర్ ప్రతిస్పందించారు.
‘కేటీఆర్ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. మీ సమాజసేవను నేను ఎంతో గౌరవిస్తుంటాను’ అని అడివి శేష్ ట్వీట్ చేశారు. ‘చాలా థాంక్స్ శేష్’ అని కేటీఆర్ రిప్లై ఇచ్చారు.