ayodhya ram mandir: భారతదేశమంతా సంబరాలు చేసుకుంటుంది. రామ స్మరణతో ఆలయాలన్నీ మారుమోగుతున్నాయి. ఈ రోజు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించేందుకు సినీ తారలు అయోధ్యకు తరలి వెళ్లారు.
టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి – సురేఖ దంపతులు, రామ్‌చరణ్ సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో రామ్‌చరణ్ మీడియాతో మాట్లాడారు. ”ఈ రోజు కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా. ఈ మహత్తర కార్యంలో భాగం కావడం సంతోషంగా ఉంది” అని చెప్పారు.
ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందడంపై చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ”చరిత్రలో గుర్తుండిపోయే రోజు. ఇందులో భాగస్వామికావడాన్ని అరుదైన అవకాశంగా భావిస్తున్నా. నేను ఆంజనేయుడి భక్తుడిని. ఆయనే స్వయంగా నాకు ఆహ్వానం పంపించినట్లు అనిపించింది” అని అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడకకు హాజరైయ్యారు.
”రామ మందిరానికి వెళ్లే ముందు హనుమంతుడిని దర్శించుకోవడం ముఖ్యం. అయోధ్యలో వాతావరణం రమణీయంగా ఉంది. ఎక్కడ చూసినా ‘జై శ్రీరామ్’ నినాదం మార్మోగుతోంది. దీపావళి మళ్లీ వచ్చినట్లుంది” అని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
”ఇది చరిత్రాత్మక రోజు. అంతటా ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. శ్రీరాముడు అయోధ్యకు వస్తున్నాడని నినదించే శతకోటి స్వరాల్లో నేను భాగమైనందుకు గర్విస్తున్నా” అని నటి జెనీలియా పేర్కొన్నారు.
అమితాబచ్చన్, రజనీ కాంత్ తో పాటు పలువురు సీనియర్ నటులు, బాలీవుడ్, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజరైయ్యారు.