తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది.
దీంతో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. సామాన్యులే కాదు.. పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటేసేందుకు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలోని పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లో నిలబడి ఓటు వేస్తున్నారు.
జూబ్లీహిల్స్ క్లబ్‌లో భార్య సురేఖతో కలిసి మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం జూబ్లీహిల్స్‌లోని పీ ఓబుల్‌రెడ్డి పబ్లిక్ స్కూల్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రంలో తల్లి, భార్యతో కలిసి సామాన్యుడిలా క్యూలైన్‌లో నిలబడి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, జూబ్లీహిల్స్ క్లబ్‌లో నటుడు సుమంత్, బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ 153లో సినీ నటుడు అల్లు అర్జున్ ఓటు వేశారు. నటుడు వెంకటేశ్, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, రాజమౌళి, తేజ, హీరో నితిన్, శ్రీకాంత్ తదితరులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ మేరకు ఫొటోలను సోషల్ మీడియాలో వేదికగా పంచుకున్నారు.