రాజధాని ప్రాంత రైతులు మంగళవారం సాయంత్రం ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్ కార్యాలయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ‘మీరూ రైతు బిడ్డే.. మా కష్టాలు మీకు తెలుసు. ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజధాని మారకుండా చూడాలి’ అని విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలు విన్న తర్వాత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..” దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులు రాజధాని కోసం 33వేల ఎకరాలు ఇచ్చారు. రాజధాని రైతుల బాధలు, ఇబ్బందులు నాకు తెలుసు. నేను రాజకీయాల్లో లేను, ప్రభుత్వంలో లేను. రాజ్యాంగ పదవిలో ఉండి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదు. మా ట్రస్ట్‌లో ఎలాంటి రాజకీయాలు మాట్లాడకూడదని నియమం. మీ ఆవేదనను అర్థం చేసుకున్నా .. ఎవరికి చెప్పాలో వారికి చెబుతా. రాష్ట్రాభివృద్ధి కోసం చేయాల్సింది ఎప్పుడూ చేస్తూనే ఉంటా” అని వెంకయ్యనాయుడు తెలిపారు.