లాక్‌డౌన్ కారణంగా సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని, సినీ కార్మికులు అనేక కష్టాలు పడుతున్నారని దాని పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని అన్నారు నందమూరి బాలకృష్ణ. అదేవిధంగా ప్రభుత్వంతో సినిమా పెద్దలు సంప్రదింపులు చేస్తున్న విషయం తనకు తెలియదని ఆయన అన్నారు. తాను కూడా అందరిలానే పేపర్ లో మీడియాలో చూశానని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా సమస్యను పరిష్కరించాలని , జీవో ను విడుదల చేస్తే షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో స్పష్టత వస్తుందని బాలకృష్ణ అన్నారు. తనను చర్చకు పిలవలేదన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ స్పందించారు.
ఆయన మీడియా తో మాట్లాడుతూ … “ఇది ఆర్టిస్ట్ లను పిలిచే మీటింగ్ కాదు. నిర్మాతలకు మాత్రమే ఈ మీటింగ్ అందుకనే బాలకృష్ణను పిలవలేదని అన్నారు. చిరంజీవి ఫెస్ వ్యాల్యూ మాకు అవసరం . ఆయనుంటే పని జరుగుతుంది అనుకున్నాం , అలానే నాగార్జున గారు ఉంటే పని జరిగిదనుకున్నాం.. మాకు ఎవరితో అయితే పని జరుగుతుందో వారినే పిలుస్తాం” అని కళ్యాణ్ అన్నారు.
“గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉన్నప్పుడు మేము బాలకృష్ణ గారినే ముందు ఉంచేవాళ్ళం .. మాకు ఎవరితో పని జరిగుతుందో వాళ్లనే పిలుస్తాం.. అంతే తప్ప సినిమా ఇండస్ట్రీలో గ్రూపులు లేవు ” అని సి కళ్యాణ్ స్పష్టం చేశారు. కాగా అది నిర్మాతల మీటింగ్ అన్న కళ్యాణ్ వ్యాఖ్యలకు ప్రభుత్వంతో చర్చలకు వచ్చిన వాళ్ళందరూ నిర్మాతలేనా ..? బాలకృష్ణ కు కూడా నిర్మాణ సంస్థ ఉందిగా..? అన్న ప్రశ్నలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.