ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ పాటించేందుకు అన్ని రాష్ట్రాలు మద్దతు పలికాయి. ఏపీలోనూ జనతా కర్ఫ్యూ తప్పకుండా పాటించాలని రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే ప్రభుత్వం సూచనలు జారీచేసింది. మార్చి 22వ తేదీన ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రధాని కోరిన విషయం తెలిసిందే. ఇక, ప్రధాని పిలుపునకు అన్ని రాష్ట్రాల సీఎంలు మద్దతు ప్రకటించారు. దీంతో, ఆయా రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీసులు కూడా నిలిచిపోనున్నాయి. రేపటి జనతా కర్ఫ్యూ దృష్ట్యా… ఏపీలో నేటి నుంచే ఆర్టీసీ బస్సుల రద్దు చేస్తామని మంత్రి పేర్నినాని తెలిపారు. దూరప్రాంతాలకు వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఈరోజే నిలిపివేయనున్నట్లు తెలిపారు. మిగతా సర్వీసులను రేపు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిలుపుదల చేయనున్నట్టు వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు నేటి రాత్రి నుంచే నిలిపివేస్తే.. తిరిగి మళ్లీ రేపు రాత్రి నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు మంత్రి పేర్నినాని.