ఆంధ్రప్రదేశ్‌లో మా అలయన్స్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది.. పూర్తి మెజార్టీ వస్తే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి… మూడు రోజుల పర్యటన కోనం విశాఖ వచ్చిన ఆమె… ఇవాళ జనసేన అధినేత పవన్‌తో కలిసి ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్య్రం అనంతరం ఎక్కువకాలం కాంగ్రెస్ ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉంది.. తెలంగాణ విడిపోయాక ఇక్కడ ఆంధ్ర ప్రజలకి సరైన న్యాయం జరగలేదు, అభివృద్ధి జరగలేదన్నారు. అటు కాంగ్రెస్, బీజేపీ రెండూ ఏమీచేయలేదని ఆరోపించిన మాయావతి… చంద్రబాబు, జగన్ కూడా రాష్ట్రానికి ఏమి చేయలేదన్నారు. పవన్ కళ్యాణ్ యువకుడు, కర్తవ్య దీక్ష ఉన్నవాడు, ప్రజలకి మార్పు చేయాలనే సంకల్పంతో ఉన్నాడు.. ఇక్కడ కొత్తరకం రాజకీయాలు పరిచయం చేయాలని చూస్తున్నారు.. అందుకే మేం కూడా ఒక ఆలోచన చేసి పొత్తుకి వచ్చామని వెల్లడించారు మాయావతి.
కమ్యూనిస్టులతో కలసి ఎన్నికలకు వెళ్తున్నాం… ఏపీ ప్రజలు చాలా తెలివైనవారు. ఆలోచించి ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు మాయావతి.. అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోసం పాటు పడ్డారని గుర్తుచేశారు. నేను యూపీకి నాలుగుసార్లు సీఎంగా చేశాను.. అల్ప బడుగు, బలహీనవర్గాలకు న్యాయం చేయాలని మా ప్రధాన లక్ష్యమన్నారు. ఇక మా పొత్తు లక్నోలో కుదిరిందని.. లక్నో బీఎస్పీ హయంలో పూర్తిగా మారిపోయిందన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీకి అవకాశం ఇచ్చారు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇవ్వాలని ప్రజలకి విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో ప్రజలకి మంచి చేసేవారు ఉండాలన్నారు మాయావతి… బీజేపీ, కాంగ్రెస్‌లా మోసం చేసేవారు వద్దన్నారామె. ఉత్తరప్రదేశ్ మోడల్ దేశం మొత్తం మీద ఉండేలా ప్రణాళికలు వేస్తున్నామని వెల్లడించారు. మా ప్రణాళికలు ఒక్క పేదలకు, దళితులకే కాదు… అన్ని వర్గాల ప్రజలకీ మేలు చేస్తుందన్నారు. మేం కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు మాయావతి.