MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో అరెస్ట్ అయి కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమెకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు. నేటితో ఆమె కస్టడీ ముగియగా.. ఆమెను సీబీఐ అధికారులు తీహార్ జైలు నుంచే వర్చువల్‌గా రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఆమె రిమాండ్‌ను జూన్ 3 వరకు పొగడిస్తూ తీర్పును వెలువరించారు.
ఈ కేసులో కవిత పాత్రపై ఈడీ స్పందిస్తూ.. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో కవిత అక్రమాలకు పాల్పడ్డారు. ఆప్ నాయకులు పొందిన రూ.100 కోట్లలో కవిత ప్రమేయముంది. సౌత్ గ్రూపు ప్రతినిధిగా ఆమె వ్యవహరించారు. లిక్కర్ హోల్‌సేల్ డీలర్ల నుంచి వచ్చిన లాభాలను కవిత, ఆమె అసోసియేట్స్ పంచుకున్నారు అని ఆరోపణలు చేసింది. ఈడీ అరెస్టు చేసిన అనంతరం కవితను ఢిల్లీకి తరలించారు. జ్యుడీషియల్ కస్టడీలోనున్న ఆమెను ఇదే కేసులో 2024 ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది.
అక్రమ నగదు చెలామణీ నిరోధక చట్టం (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ – పీఎంఎల్ఏ) కింద కవితపై ఆరోపణలు మోపారు. పీఎంఎల్‌ఏ కేసుల్లో దర్యాప్తు సంస్థ వ్యతిరేకిస్తే సదరు వ్యక్తికి బెయిలు రావడం దాదాపుగా అసాధ్యం. బెయిలుకు సంబంధించి పీఎంఎల్‌ఏలో సెక్షన్ 45లో రెండు నిబంధనలు ఉన్నాయి. బెయిలు అభ్యర్థనపై తమ అభిప్రాయం చెప్పేందుకు లేదా దీన్ని వ్యతిరేకించేందుకు మొదటగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు అవకాశం ఇవ్వాలనేది దీనిలో మొదటి నిబంధన.
అయితే, ఒకవేళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ బెయిలు అభ్యర్థనను వ్యతిరేకిస్తే, ఆ నిందితుడు బెయిలుపై వెళ్లినప్పుడు మళ్లీ ఆ నేరం చేయడని లేదా కేసును ప్రభావితం చేయడని కోర్టు నిర్ధారించుకోవడమనేది రెండో నిబంధన. ప్రస్తుత కేసులో కవిత బెయిలు అభ్యర్థనలను పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఆమె బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఆరోపిస్తున్నారు. మహిళలకు మినహాయింపు ఉంటుందిగా? పీఎంఎల్‌ఏ కేసుల్లో ఒక మినహాయింపు ఉంటుంది.
‘ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి 16 ఏళ్లలోపు వ్యక్తి అయినా లేదా మహిళ అయినా లేదా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా బెయిలు ఇవ్వొచ్చు. అయితే, దీనికి ప్రత్యేక కోర్టు అనుమతి అవసరం’ అని ఆ మినహాయింపులో పేర్కొన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని మహిళలు, మైనర్లకు ఉండే
మినహాయింపుల్లానే ఈ మినహాయింపు పనిచేస్తుంది. ఆ మినహాయింపును కింద కవితకు బెయిలు ఇవ్వాలని ఏప్రిల్ 8న కవిత తరఫున వాదించిన అభిషేక్ మను సింఘ్వి చెప్పారు.
అయితే, దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు స్పందిస్తూ.. ‘ఆమె ఇంటికి పరిమితమయ్యే గృహిణి (హౌస్‌హోల్డ్ లేడీ) కాదు. ఆమెకు ఈ మినహాయింపు కింద అవకాశం ఇవ్వకూడదు’ అని వాదించారు. దీనిపై జడ్జి స్పందిస్తూ.. గృహిణి లేదా మహిళా వ్యాపారవేత్త లేదా ప్రముఖురాలు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా రాజ్యాంగంలో నిబంధనలు ఉండవు. అని చెప్పారు. మరి తిరస్కరణ ఎందుకు? కవిత బెయిల్ పిటిషన్ పై మే 6న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.
ప్రస్తుత కేసులో నిందితురాలు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని జడ్జి కావేరీ బవేజా అభిప్రాయపడ్డారు. ‘కవిత విద్యావంతురాలు, సమాజంలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెను ‘వల్నరబుల్ ఉమన్’గా భావించి మినహాయింపు ఇవ్వలేం’ అని జడ్జి స్పష్టంచేశారు. అంతేకాదు ‘కోర్టు ముందున్న సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం ఈ కేసులో ఆధారాలు లేకుండా చేసేందుకు తన ఫోన్లను కవిత ఫార్మాటింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి’ అని జడ్జి చెప్పారు. కవిత బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చారు.